ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన వారిపై సొంత పార్టీలోనే తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో జగన్ చాలా మందికి హామీలు ఇచ్చారు. వీరిలో కొందరు త్యాగాలు కూడా చేశారు. వీరిని కాదని ఎన్నికల్లో ఓడిన వారికి, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంతో మిగిలిన ఆశావాహులు భగ్గుమంటున్నారు. మంగళగిరిలో ఎలాగైనా లోకేశ్ ని ఓడించాలనే లక్ష్యంతో ఎన్నికల సభలో చేనేతల ఓటుబ్యాంకు తమవైపు తిప్పుకునేందుకు చేనేత వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించారు. అదే సభలో ఆళ్ల రామక్రిష్ణా రెడ్డిని గెలిపిస్తే వ్యవసాయ శాఖా మంత్రిని చేస్తామని కూడా ఘనంగా ప్రకటించారు.
తీరా ఇప్పుడు చేనేతలకు ఇస్తామన్న ఎమ్మెల్సీ ఎత్తేశారు. ఆళ్లకు మంత్రి పదవి ఇవ్వలేదు. సీఆర్డీఏ చైర్మన్ ని చేస్తామని లీకులిచ్చి అటకెక్కించేశారు. ఇక తన తండ్రికి అత్యంత విశ్వసనీయుడైన మర్రి రాజశేఖర్‌కు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానన్న జగన్ రెండూ ఇవ్వలేదు. జగన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన వారి లిస్టే ఏకంగా 15 వరకు ఉంది.
ఇక హామీ ఇచ్చిన వారందరికీ హ్యాండ్ ఇచ్చేసి..తనతో అక్రమాస్తుల కేసులో నిందితుడైన మోపిదేవి వెంకటరమణకుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. గత ఎన్నికల్లో రేపల్లెలో పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవిని జగన్ ఏకంగా మంత్రిని చేసి.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక చాలా సామాజికవర్గాలు ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకుంటే వారిని కాదని ఎన్నికలకు ముందే టీడీపీ వీడి వైసీపీలో చేరిన రెడ్డి వర్గానికే చెందిన చల్లా రామకృష్ణారెడ్డికి మరో ఎమ్మెల్సీ కట్టబెట్టారు.
ఇక మూడో ఎమ్మెల్సీని ఎన్నికల్లో హిందూపురంలో పోటీ చేసి బాలయ్యపై ఓడిన మహ్మద్ ఇక్బాల్‌కు ఇచ్చారు. ఇలా ఎన్నికల్లో ఓడిన వారికి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికే మూడు ఎమ్మెల్సీలు కట్టబెట్టడంతో పార్టీలో చాలా మంది బయటకు చెప్పుకోలేకపోయినా తీవ్ర అసంతృప్తితో మండిపడుతున్నారు. ఎన్నికల్లో పార్టీకి వన్‌సైడ్‌గా సపోర్ట్ చేసిన కొన్ని సామాజికవర్గాలు కూడా జగన్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు.