టాలీవుడ్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇటీవల దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ డీప్ ఫేక్ వీడియోను ముక్తకంఠంతో ఖండించారు. దీనిపై కేంద్రం కూడా వెంటనే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ వీడియోను తొలుత పోస్టు చేసిన ఓ ఐపీ అడ్రస్‌ను కేంద్ర ఐటీ శాఖ అధికారులు కనిపెట్టారు. దాని ద్వారా ట్రేస్ చేసి ఆ ఖాతాదారుడిని గుర్తించారు.
రష్మిక వీడియోను తొలుత తన ఖాతాలో అప్‌లోడ్ చేసి తర్వాత ఇతర అకౌంట్లలో షేర్ చేసిన బిహార్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడి సోషల్ మీడియా అకౌంట్ నుంచి రష్మిక మార్ఫింగ్ వీడియో అప్‌లోడ్ అయిందని దిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. అయితే ఆ యువకుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ వీడియోను డౌన్లోడ్ చేసినట్లు విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు.