తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగులు!

-

క్రికెట్ మ్యాచ్ అయినా.. స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా.. ప్రో కబడ్డీ అయినా.. చివరకు ఎలక్షన్ అయినా.. బెట్టింగ్ మాత్రం కామన్. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందా.. బీజేపీకి ఓ ఛాన్స్ వస్తుందా అంటూ బెట్టింగ్ రాయుళ్లు పందేలు వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ ఎన్నికలపై ఆన్​లైన్ వేదికగా ఏపీలో బెట్టింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా కొంతమంది ఈ బెట్టింగులు నిర్వహిస్తున్నారు.

అభ్యర్థుల గెలుపోటములపై 1:5 (రూ.100కి 500) చొప్పున బెట్టింగ్ కాస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బరిలో నిలిచినచోట వారికి వచ్చే మెజార్టీలపై 1:10 (రూ.100కి వెయ్యి) నిర్వాహకులు ఊరిస్తుండటంతో కొంతమంది వారి వలలో పడి బెట్టింగులు కాస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన క్రికెట్‌, కోడి పందేల నిర్వాహకులు తెలంగాణ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి అందినకాడికి అమాయకుల నుంచి దోచేస్తున్నారు. తెలంగాణలో తదుపరి సీఎం ఎవరు అన్న విషయమై కూడా బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆరే సీఎం.. మరి కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే ఎవరు సీఎం అవుతారంటూ ఆప్షన్లు ఇచ్చి మరీ బెట్టింగు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news