స్విట్జర్లాండ్‌లో శ్రీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న స్విస్ అధికారులు..!

-

ఎక్కడ చూసినా మంచు దుప్పటి కప్పుకున్న అందాలతో పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది స్విట్జర్లాండ్. ముఖ్యంగా భారతీయులు స్విట్జర్లాండ్ పర్యటనను ఎంతగానో ఇష్టపడతారు. అందుకు కారణం బాలీవుడ్ సినిమాలే. అప్పట్లో యష్ చోప్రా అనేక సినిమాలను అక్కడ షూటింగ్ చేశారు. దీంతో స్విస్ టూరిజానికి అది ప్రమోషన్ అయింది. అంతేకాకుండా నటి శ్రీదేవి కూడా స్విస్ టూరిజానికి ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు అక్కడి ఇంటర్‌లేకెన్ అనే ప్రాంతంలో శ్రీదేవి విగ్రహాన్ని నిర్మించాలని స్విస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్‌లేకెన్ అధికారులు కూడా వివరాలను వెల్లడించారు.

1989లో శ్రీదేవి నటించిన చాందిని అనే సినిమాలో చాలా భాగం స్విట్జర్లాండ్‌లోనే షూట్ చేశారు. అంతకు ముందు 1964లో రాజ్ కపూర్ సంగమ్ సినిమాను, ఆ తరువాత 1967లో యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్ అనే చిత్రాన్ని స్విస్‌లో తీశారు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ చాలా భారతీయ సినిమాలకు మంచి షూటింగ్ లొకేషన్‌గా మారింది. ఇక 1995లో యష్ చోప్రా దిల్‌వాలే దుల్హనియా లే జాయెంగె సినిమాను తీయడంతో స్విట్జర్లాండ్ పట్ల భారతీయ టూరిస్టుల్లో ఎక్కడ లేని ఆసక్తి కలిగింది. ఈ క్రమంలోనే పలు టూరిస్టు సంస్థలు బాలీవుడ్ ప్యాకేజీల పేరిట స్విస్ టూర్లను భారతీయ పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు.

ఇక 2016లో యష్ చోప్నా విగ్రహాన్ని కూడా ఇంటర్‌లేకెన్‌లో స్విస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకు ముందు 2011లోనే యష్ చోప్రాను ఇంటర్‌లేకెన్ అంబాసిడర్‌గా స్విస్ ప్రభుత్వం ప్రకటించింది. ఓ రైలుకు, ఓ సరస్సుకు యష్ చోప్రా పేరు పెట్టింది. ఆ తరువాత ఇప్పుడే అక్కడ శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇంటర్‌లేకెన్ అధికారులు సంకల్పించారు. త్వరలోనే విగ్రహం నిర్మాణమై ఆవిష్కరణ కానుంది. శ్రీదేవి గౌరవార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్విస్ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news