బోయపాటి సినిమాలో రామ్ కు జోడీగా శ్రీలీల

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో.. రామ్ పోతినేని కాంబినేషన్ లో అదిరిపోయే పాన్ ఇండియా సినిమా రాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి రామ్ తనలోని ఊర మాస్ అవతారంతో ఫ్యాన్స్ ని ఖుష్ చేశారు. ఇటీవలే పోలీసు పాత్రలో వారియర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు బోయపాటితో తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నారు.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విజయదశమిని పురస్కరించుకుని ఈ మూవీ టీమ్ ఓ సూపర్ అప్డేట్ ను ఫ్యాన్స్ కి ఇచ్చింది. ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల నటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలీల తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

“విజయదశమి పర్వదినాన మీ అందరితో ఓ మంచి విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికి దసరా శుభాకాంక్షలు.” అంటూ తాను బోయపాటి-రామ్ పోతినేని సినిమాలో రామ్ కి జోడీగా నటిస్తున్న విషయాన్ని ట్విటర్ లో షేర్ చేసింది శ్రీలీల.