శ్రీరామనవమి స్పెషల్; రాముడి పాత్ర చేసిన టాలీవుడ్ హీరోలు…!

-

రామ నామము రమ్యమైనదని పండితులు ఊరికే అనలేదు. రామతత్వం లో ఇమిడి ఉన్న మానవీయ విలువలను గూర్చి ఆమాట అన్నారు. రాముడిని తలచుకోగానే తెలుగు ప్రజలందరికీ మనసులో మెదిలే రూపం ఎన్టీ రామారావు గారు. రాముడంటే ఇలా ఉంటాడని ప్రతి ఒక్కరి మనసులో తనదైన రూపాన్ని ముద్రించిన మహా నటుడు ఎన్టీఆర్. రాముని పాత్రలో ఆయన నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్.

ఎందుకంటే ఆ పాత్రలో ప్రజలు చూసింది ఎన్టీఆర్ ను కాదు, సాక్షాత్ శ్రీ రామ అవతారాన్ని చూశారు. నాటి నుంచి నేటి వరకు రామాయణం ఏ సమయంలో సినిమాగా తీసినా కూడా ప్రజలు ఆదరించారు. అదీ రామాయణానికి, రామునికి ఉన్న విశిష్టత. రాముని పాత్రలో ఎన్టీఆర్ తరువాత అంతటి మెప్పు పొందిన వ్యక్తి  ఏఎన్నాఆర్ అయితే ఆయన నటజీవితాన్ని ‘సీతారామ జననం’ సినిమాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం.

తరువాత హీరో శోభన్ బాబు కూడా రాముని పాత్ర చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబు. ఈ సినిమాలో రామయ్య తండ్రీ ఓ రామయ్య తండ్రీ మా సామీ వంటి నీవేలే రామయ్య తండ్రీ అనే పాట ఎప్పటికీ తెలుగువారి మదిలో రాముని ఔన్నత్యాన్ని చాటుతుంది. వారి తరువాత రాముని పాత్రలో మెప్పించింది నటుడు సుమన్.

ఆయన నాగార్జున రామదాసు గా నటించిన శ్రీరామదాసు సినిమాలో సుమన్ శ్రీరామ చంద్రుడి పాత్రలో అలరించాడు. మరలా రాముడి పాత్రలో తండ్రి ఎన్టీఆర్ కు వచ్చిన ప్రశంసలు బాలకృష్ణ రాముని పాత్ర లో నటించిన సినిమా శ్రీ రామరాజ్యం సినిమాకు దక్కాయి. బాలయ్య అభినయం చూసి ఎన్టీఆర్ ను గుర్తుచేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తె తన నటజీవితాన్ని రామాయణం చిత్రంలో రాముడి పాత్రతో ప్రారంభించాడు.

చిన్న వయసులోనే అది కూడా మొట్ట మొదట నటించిన సినిమా లోనే రాముని పాత్ర చేసి ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రాముని పాత్ర లో ఒదిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వారి మూడు తరాల హీరోలు వెండితెర రాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news