ప్రభుత్వానికి చెప్పకుండా, ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఏకపక్షంగా.. మహర్షి సినిమా ఆడనున్న థియేటర్లలో కొన్నింటిలో టిక్కెట్ల రేట్లను ఎలా పెంచుతారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి రేపు పెద్ద ఎత్తున విడుదలవుతున్న విషయం విదితమే. ఈ సినిమా మహేష్‌కు 25వ సినిమా కాగా.. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా రేపు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో గత 5 రోజుల కిందటి నుంచే థియేటర్లు, మల్టీప్లెక్సులలో టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే పలు థియేటర్లలో టిక్కెట్ల రేట్లను పెంచారని అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
సాధారణంగా మూములు థియేటర్లు అయితే బాల్కనీ టిక్కెట్ ధర రూ.80 నుంచి రూ.100 వరకు ఉంటుంది. అలాగే మల్టీ ప్లెక్స్‌లలో టిక్కెట్ల ధరలు రూ.120 నుంచి రూ.150 వరకు ఉంటాయి. అయితే మహర్షి సినిమాకు గాను పలు థియేటర్ల ఓనర్లు టిక్కెట్ల రేట్లను పెంచారు. దీంతో రూ.80 టిక్కెట్ రూ.110కి అమ్ముతుండా, మల్టీప్లెక్స్‌లలో రూ.30 నుంచి రూ.60 వరకు టిక్కెట్ల ధరలు పెరిగాయి. ఈ క్రమంలో అభిమానులు గొడవ చేయగా, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించింది. టిక్కెట్ల రేట్లను పెంచడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ప్రభుత్వానికి చెప్పకుండా, ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఏకపక్షంగా.. మహర్షి సినిమా ఆడనున్న థియేటర్లలో కొన్నింటిలో టిక్కెట్ల రేట్లను ఎలా పెంచుతారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విషయంపై స్పందించారు. చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఇతర అధికారులతో కలసి మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే పలు థియేటర్లు టిక్కెట్ల రేట్లను పెంచాయని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 79 థియేటర్లలో టిక్కెట్ల రేట్లు పెరిగాయని అన్నారు. అయితే ఇలా ఏకపక్షంగా సినిమా టిక్కెట్ల రేట్లను పెంచడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని మంత్రి తలసాని అన్నారు. సామాన్యులు కూడా సినిమా చూడాలంటే ధరలు తక్కువగానే ఉండాలని, కోర్టు నిర్ణయం ప్రకారం ఒక వేళ థియేటర్ల యజమానులు టిక్కెట్ల రేట్లను పెంచి ఉంటే గనుక.. ఆ విషయంపై ప్రభుత్వం తరఫున హైకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!