మిస్​ యూనివర్స్​పై ఉపాసన కేసు.. అసలేం జరిగిందంటే?

-

మిస్​ యూనివర్స్-2021గా నిలిచిన భారతీయ యువతి హర్నాజ్​ సంధుపై కోర్టులో పిటిషన్ వేసింది ప్రముఖ నటి ఉపాసన. చండీగఢ్​లోని జిల్లా కోర్టులో తన లాయర్ల ద్వారా ఈ చర్యలు తీసుకుంది. అసలు ఏమైందో తెలుసుకుందాం.

హర్నాజ్​ సంధు నటించిన పంజాబీ చిత్రం ‘బై జీ కుట్టంగే’ ప్రమోషన్లలో పాల్గొనట్లేదని ఆమెపై ఫిర్యాదు చేసింది ఉపాసన. మిస్​ యూనివర్స్​ అయిన తర్వాత.. అసలు సినిమా గురించి పట్టించుకోవట్లేదని ఆరోపించింది. చిత్రీకరణకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆమె ప్రమోషన్లలో పాల్గొనాలని, లేదా సినిమాకు మద్దతుగా నిలవాలని చెబుతున్న ఉపాసన.. ఆమె అలా చేయట్లేదని పేర్కొంది.

సినిమా షూటింగ్​కు ముందు ఆమె సాధారణ యువతి అని.. మిస్​ యూనివర్స్​ అయ్యాక సినిమాను పూర్తిగా విస్మరించిందని ఉపాసన తన పిటిషన్​లో ఆరోపించింది. హర్నాజ్​ సంధు ప్రమోషన్స్​లో పాల్గొనాలనే.. మేలో విడుదల చేయాల్సిన సినిమాను ఆగస్టుకు వాయిదా వేశామని.. అయినా ఫలితం లేదని చెప్పింది.

మిస్​ యూనివర్స్​ తన తొలి సినిమా పట్ల ఇలా నిర్లక్ష్యంగా ఉండటం ఏమాత్రం బాలేదని, పంజాబ్​ సినీ రంగానికి ఇది సిగ్గుచేటుగా అభివర్ణించింది ఉపాసన సింగ్​. బై జీ కుట్టంగే సినిమా ఈ ఆగస్టు 19న విడుదల కానుంది. దేవ్​ కరౌడ్​, నానక్​ సింగ్​, హర్నాజ్​ సంధు, ఉపాసన సింగ్​ ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్​ ఎంటర్​టైన్​మెంట్​ స్టూడియోస్​పై సినిమాను నిర్మించింది. స్మీప్​ కాంగ్​ దర్శకుడు.

గతేడాది ఇజ్రాయెల్​ వేదికగా జరిగిన మిస్​ యూనివర్స్​ పోటీల్లో విజేతగా నిలిచింది భారత్​కు చెందిన హర్నాజ్​ సంధు. 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొనగా వారందరినీ వెనక్కినెట్టి.. మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని ముద్దాడింది.

దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్​ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది. హర్నాజ్ సంధు.. 2000 మార్చి 3న పంజాబ్​లోని చండీగఢ్​​లో జన్మించింది. డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాస్టర్స్​ చదువుకుంటోంది.

ఓ వైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తోందీ 22 ఏళ్ల అమ్మడు. 17ఏళ్ల వయసులో మోడలింగ్​ ప్రారంభించింది హర్నాజ్​ సంధు.
హర్నాజ్​ ఇప్పటివరకు 2017లో టైమ్స్​ ఫ్రెష్​ ఫేస్​ మిస్​ చండీగఢ్​, 2018లో మిస్​ మ్యాక్స్​ ఎమర్జింగ్​ స్టార్​, 2019లో ఫెమినా మిస్​ ఇండియా పంజాబ్​, మిస్ దివా 2021, ఇప్పుడు 2021లో మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version