ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూత

-

ప్రముఖ నటి, దర్శకురాలు, నటుడు కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయ నిర్మల.. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

తన మొదటి భర్త కృష్ణమూర్తి నుంచి విడాకుల తీసుకున్న తర్వాత విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె 1946 ఫిబ్రవరి 20 న తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రిది చెన్నై, తల్లిది మాత్రం ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేట.

గిన్నిస్ బుక్ లో స్థానం

విజయ నిర్మల దర్శకురాలుగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. ఆమె అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. 2002లో ఆమె గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఆమె అప్పటికే 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.

విజయ నిర్మల తన మొదటి సినిమా మీనా ను 1971 లో తీశారు. అప్పటి నుంచి 2009 వరకు ఆమె మొత్తం 44 సినిమాలను తీశారు. ఆమెకు సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. విజయకృష్ణ పతాకంపై 15 వరకు సినిమాలను నిర్మించారు.

ఆమె దర్శకత్వం వహించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు

దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ.

ఏడో ఏట సినీరంగ ప్రవేశం.. పదకొండో ఏట తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి

విజయ నిర్మల అసలు పేరు నిర్మల. కానీ.. తనకు నటనలో మొదటి సారి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్ పేరునే తన పేరుగా మార్చుకున్నారు. అలా విజయ నిర్మలగా మారారు. ప్రముఖ నటుడు నరేశ్ విజయనిర్మల కొడుకే. ప్రముఖ నటి జయసుధకు కూడా విజయనిర్మల పిన్ని వరుస అవుతారు.

తన ఏడో ఏట.. తమిళ ఇండస్ట్రీలో 1950లో మత్స్యరేఖ అనే సినిమా ద్వారా సినీ రంగం ప్రవేశం చేశారు విజయ నిర్మల. ఆ తర్వాత తన 11వ ఏట.. పాండురంగ మహత్యం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రంగులరాట్నం అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 200 కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఆమె బుల్లి తెరపైన కూడా నటించారు. పెళ్లి కానుక అనే సీరియల్ లో ఆమె నటించారు.

పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడి పంటలు, అల్లూరి సీతారామరాజు, తాతా మనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్నీ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా విజయ నిర్మల మెప్పించారు.

సాక్షి సినిమాతో ఒక్కటయిన కృష్ణ, విజయనిర్మల

కృష్ణ, విజయనిర్మల కలిసి సాక్షి సినిమాలో నటించారు. ఆ సినిమాలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో వీళ్ల పెళ్లి జరిగింది. 2009లో కృష్ణ హీరోగా తెరకెక్కిన నేరము – శిక్ష అనే సినిమాకు విజయ నిర్మల చివరగా దర్శకురాలిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆమె దర్శకత్వం వహించలేదు. ఆమె నటించిన సినిమాల్లో దాదాపు 47 సినిమాల్లో ఆమె కృష్ణతో కలిసి నటించారు.

ఇక.. ఆమెకు ఎన్నో పురస్కారాలు దక్కాయి. విజయనిర్మల గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమే కాదు.. హీరోయిన్ గా నటించిన తన తొలి సినిమా రంగుల రాట్నానికి ఆమెకు నంది అవార్డు వచ్చింది. సినీ రంగంలో ఇచ్చే ఉన్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆమెను వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news