బాలీవుడ్ సినిమాలో విలన్‌గా రౌడి బాయ్.. జోడిగా దీపికపదుకుణే!

‘లైగర్‌’తో బాలీవుడ్‌లోనూ స్టార్‌హీరోగా నిలదొక్కుకోవాలని ఆశపడ్డారు నటుడు విజయ్‌ దేవరకొండ. అయితే, ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ బీటౌన్‌ నుంచి విజయ్‌కు ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్‌ ఏమిటంటే ‘బ్రహ్మాస్త్ర’


బాలీవుడ్‌ నుంచి విడుదలైన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్‌, అలియా భట్‌ నటీనటులు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర – 2’పై చిత్రబృందం దృష్టి పెట్టింది. శివ గతాన్ని, అతడి తల్లిదండ్రుల గురించి, సినిమాలోని మెయిన్‌ విలన్‌ని ఇందులో చూపించనున్నట్లు సమాచారం.


దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉన్న నటుడిని దేవ్‌ పాత్రలో చూపిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. ఈ మేరకు విజయ్‌ దేవరకొండ అయితే ఈ రోల్‌కు సరైన న్యాయం చేయగలరని, అలాగే, ఆయన్ని తమ టీమ్‌లోకి చేర్చుకుంటే దక్షిణాదిలోనూ తమ సినిమాకి పాపులారిటీ వస్తుందని నిర్మాత కరణ్‌ జోహార్‌, చిత్ర దర్శకుడు అయాన్‌ అనుకున్నారని, దీంతో విజయ్‌ని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. సినిమాలో మెయిన్‌ విలన్‌గానే కాకుండా రణ్‌బీర్ తండ్రి పాత్రలో దీపికకు జోడీగా విజయ్‌ దేవరకొండ కనిపించే అవకాశం ఉందని ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.