రోజురోజుకు టమాటా ధర పడిపోతోంది. దీంతో టమాటా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో బుధవారం టమాటా ధర అమాంతం పడిపోయింది. నిన్న, మొన్నటి దాకా కిలో రూ.5 పలికిన టమాటా 50 పైసలకు పడిపోయింది. పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిలో టమోటా 50 పైసలు పలకడంతో కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌లోనే టమోటాను రైతులు పారబోశారు. తమకే ఎదురు ఖర్చులు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కోసి మార్కెట్‌కు తరలిస్తుంటే ట్రాన్స్‌పోర్టు చార్జీలు కూడా రావడం లేదంటున్నారు.
పంట సాగు చేపట్టే ముందు ధర ఎక్కువగా ఉందని, అధిక సంఖ్యలో సాగు చేపట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా ధర పతనమై నష్టాపోతున్నామని రైతులు వాపోతున్నారు. మూడేళ్ల క్రితం పత్తికొండ మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటామని ప్రకటన చేశారు. అయితే ఆ హామీని అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్
చేస్తున్నారు.