శిష్యులతో శంకర లీలలు మహిమాన్వితం !

-

శంకరులు ఒకసారి కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన దగ్గరికి వచ్చి నేను బ్రాహ్మణుడిని, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ దగ్గర శిష్యుడిగా ఉండే వరం ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ విధంగా శంకరులకు అత్యంత ఆత్మీయుడిగా మారడంతో మిగిలిన శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. ఇది గమనించిన శంకరులు వారిలో ఉన్న అసూయను పారద్రోలాలని నిర్ణయించుకుని ఒక రోజు గంగానదికి అవతల ప్రక్కన ఉన్న సదానందుడిని రమ్మని పిలిచారు. వెంటనే సదానందుడు నదిమీద నడుచుకుంటూ ఇవతల ప్రక్కకి వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు తీసి అడుగు వేసిన చోట్ల మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి.

అది చూసిన సాటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటినుండి సదానందుడు ‘పద్మపాదుడు’ అయ్యాడు. పద్మపాదుడికి సంబంధించి మరొక కథ ప్రచారంలో ఉంది. శంకరులు శ్రీశైల పరిసరాలలో చాలా కాలం తపస్సు చేశారు. శంకరులు తపస్సు చేసుకుంటూ ఉన్న పరిసరాలలో హిందూ ధర్మప్రచారం చేస్తున్న కాలంలో శంకరుడు చేసే కార్యాలు నచ్చని కొందరు (కాపాలికులు) ఆయనని అంతమొందించాలనే ప్రయత్నంలో ఆ పరిసరాలలో భీభత్సం సృష్టిస్తున్న ఒక పెద్ద దొంగలముఠా నాయకుడిని రెచ్చగొట్టి కొంత ధనం ఇచ్చి పంపించారు. ఆ నాయకుడు పెద్ద కత్తితో మాటువేసి తపస్సు చేసుకుంటున్న శంకరుల వెనుకగా ఒక వేటుతో తల ఎగరగొట్టే ప్రయత్నంలో ముందుకు ఉరికాడు. ఆ సమయంలో పద్మపాదుడు మల్లిఖార్జునుడి దేవాలయంలో ఈశ్వరుడిని ధ్యానిస్తూ కూర్చుని ఉన్నాడు. ఈశ్వరుడినే మనసులో ఉంచి ధ్యానం చేస్తున్న అతనికి హఠాత్తుగా ఈ దృశ్యం కనిపించింది.

వెంటనే అతడు మహో ఉగ్రుడై శ్రీలక్ష్మీనృశింహుడిని వేడుకోవడం ప్రారంభించాడు. అంతే ఎటువైపు నుండి వచ్చిందో ఒక సింహం దాడి చేసి దొంగలముఠానాయకుడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చి ఎలా వచ్చిందో అలాగే మాయమైంది. తరువాత మిగిలిన శిష్యులకు ఈ విషయం తెలిసి పద్మపాదుడి శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు. ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్న కాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగానది వైపు వెళుతుండగా మధ్య దారిలో నాలుగు కుక్కలతో ఒక ఛండాలుడు అడ్డుపడ్డాడు. అప్పుడు శంకరులు ఆయన శిష్యులు ప్రక్కకు తప్పుకోమని కోరగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు …

అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమెవచైతన్యాత్
ద్విజపర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గుచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడిలోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా లేక లోపల ఉన్న ఆత్మనా? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు. అ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు తరువాతి కర్తవ్యాన్ని వివరించాడు. వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేలా ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేలా ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపించాలి. కర్తవ్యాన్ని బోధించిన పరమశివుడు ఆ పనులు అయిన తరువాత నన్ను చేరుకుంటావు అని చెప్పి అంతర్థానం అయ్యాడు.

శివుడి కర్తవ్య బోధనకు శంకరులు గంగానదిలో స్నానం చేసి కాశీ నుండి బదిరికి బయలుదేరారు. బదిరిలో ఉన్న పండితుల, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అని అంటారు. తరువాత శంకరులతో విభేదించిన వారికి కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. తరువాత బదిరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము, లలితా త్రిశతిలకు కూడా భాష్యాలు రాశారు. ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు.

ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా, శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు ‘నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ’మని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు ‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. అలా ఆయన అనేక లీలలు చూపించి భక్తులను అనుగ్రహించాడు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version