పూర్వకాలంలో మహిషి అనే రాక్షసి భోలా శంకరుడి వరం పొంది ప్రజలను, ఇంద్రాది దేవతలను సైతం హింసిస్తుంది. తనకు ఆడ, మగ కలయికతో పుట్టిన వారితోగానీ, విల్లు, ఇతర ఆయుధాలతోగానీ మరణం లేకుండా వరం పొందుతుంది. ఆ తర్వాత ఇంద్రాది లోకాలకు వెళ్లి వికృత చేష్టలకు దిగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.
![history of ayyappa swamy history of ayyappa swamy](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/11/ayyappa-swamy-4.jpg)
మహిషి చేష్టలకు భయాందోళనలకు గురైన దేవతలు మహావిష్ణువును శరణు కోరతారు. దీంతో ఆయన మోహిని అవతారమెత్తి పరమశివుడిని మోహిస్తాడు. వీరద్దరి కలయిక వల్ల అయప్ప జన్మిస్తాడు. మణిమాలతో కేరళ రాజ్యంలోని ఆటవీ ప్రాంతంలో పాండ్యరాజులకు దొరుకుతాడు. మణిమాలతో దొరికిన ఆ శిశువుకు మణికంఠుడు అని నామకరణం చేస్తారు. మణికంఠుడు మహిషిని వధించి దేవతలు, మునుల పూజలు అందుకుంటాడు. అనేక మహిమలతో పాండ్య రాజులకు, ప్రజలకు దగ్గరవుతాడు.
దీక్షా నియమాలు
అయ్యప్ప మాలధారులు నలుపు, హనుమాన్ కాశాయం రంగు వస్ర్తాలు ధరించాలి.
- గురుస్వామి, తల్లిదండ్రులు, అర్చకస్వామి ద్వారా మాల ధరించాలి.
- ముందు రోజు మద్యం, మాంసం తినరాదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకొని మెట్లు ఎక్కే వరకు 41 రోజులు పూర్తి చేయాలి.
- స్వాములు నేలపైనే నిదురించాలి. పరుపులు, దిండ్లు పాదరక్షలు వాడకూడదు. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో బ్రాహ్మచారిత్వం పాటించాలి. బయటి తినుబండారాలు తినకూడదు.
- ఉదయం, సాయంత్రం రెండు పూటల చన్నీటితో స్నానం చేయాలి. పగలు బిక్ష, రాత్రి అల్పాహారం తీసుకోవాలి. వేకువజామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్పస్వామికి పూజ చేయాలి.
- అశుభ కార్యాల్లో పాల్గొనవద్దు. అసవరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయొద్దు.
- నిదురించేప్పుడు, పాద నమస్కారం చేసేటప్పుడు మెడలో ఉన్న మాల నేలకు తాకకుండా జాగ్రత్త పడాలి.
- దీక్షలో ఉండగా రక్తసంబంధీలకులు, దగ్గరి బంధువులు, దాయదులు మరణిస్తే మాలను విసర్జింపజేయాలి. నడిచే దారిలో శవం ఎదురైతే, జన సందోహంలో తిరిగినప్పుడు రజస్వల అయితే, బహిష్టు అయిన వారు ఎదురైతే సన్నిధికి రాగానే ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా స్నానం చేసి శరణుఘోష చెప్పాలి.
- స్వాములు చేసే దీక్ష, పూజ, భుజించే బిక్ష, నిద్ర సృష్టి ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి.
- బిక్ష ఎవరైనా శుభ్రంగా తయారు చేసి పెట్టొచ్చు.
- దీక్షా సమయంలో గడ్డం గీసుకోవడం, క్షవరం చేయించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు. పగలు నిద్రించకూడదు.
- ఇంట్లో ఒక వేరు గదిలో ఉండాలి.
- స్వామికి నెయ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి వచ్చి సన్నిదానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి లేక కన్నతల్లితో మాల విసర్జన చేసి దీక్షను ముగించాలి.