వైశాఖ శుద్ధ పంచమి శ్రీ ఆది శంకరాచార్య జయంతి

-

ఏప్రిల్‌ 28- వైశాఖ శుద్ధ పంచమి ప్రత్యేకం: శ్రీ శంకరాచార్యులు అంటే తెలియన హిందువులు ఉండురు. షన్మతాచార్యులుగా, అద్వైతసిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆచరించి చూపిన మహానుభావుడు. ఆయన శివ, విష్ణు, శక్తి, గాణపత్య, సౌర, కార్తీకేయ అన్ని రూపాలలో భగవధారాధనను చేసే పద్ధతులను ఆయా పూజలు, స్తోత్రాలను భారతజాతికి అందించిన శివస్వరూపం. ఆయన జన్మదినమైం సందర్భంగా ఆయన జనన విశేషాలు తెలుసుకుందాం….

శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతంపై ఉన్న శివుడిని ప్రార్థించగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు పుత్ర సంతానాన్ని ప్రసాదించాడు. పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామికి ఏ విధంగా జన్మ యిచ్చిందో అదే విధంగా ఆర్యమాంబ శంకరులకు జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు.

ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అని అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్యకాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలు ఉన్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారం అని నమ్మకం ఉంది. కంచి మఠం ప్రకారం శంకరులు రెండు వేల సంవత్సరాలకు పూర్వం అంటే క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు. కూర్మపురాణం ప్రకారం శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని పేర్కొంది.

శంకరుల చిన్నతనంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కుమారుడైన శంకరుల పోషణ బాధ్యతలను స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు. శంకరులు ఏకసంథాగ్రాహి కావడంతో బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకనాడు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగారు. పేదరాలైన ఆ ఇల్లాలు ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన శ్రీలక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింప చేసింది. ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణానది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారడంతో గ్రామప్రజలు శంకరులు జరిపిన ఈ కార్యానికి ఆశ్చర్యచికితులయ్యారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news