కొన్ని సంప్రదాయాలు.. ఆచారాలు విస్తుపోయేలా ఉంటాయి. అవునా.. అంటూ కనుబొమ్మలు ఎగరేసేలా చేస్తాయి. కొన్ని ప్రాంతాల పేర్లు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వంటల్లో వాడే కొన్ని దినుసులు మన దగ్గరే పండుతాయి? అన్నట్లుగా ఉంటుంది. కానీ.. అవి ఎక్కడో పొరుగు దేశంలో పండుతాయి. అంతలా మన పోపుల పెట్టెలో అవి చేరిపోతాయి. చిరపరిచయం అవుతాయి. తెలంగాణలోని ఓ ఊరి పేరు ‘ఇస్లాంపూర్’. కానీ.. ఆ ఊరిలో ఒక్క ముస్లిం కూడా ఉండరు.
ఆ గ్రామంలోని రామాలయం మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేమస్. ఆంధ్రప్రదేశ్‌లోని మరోఊరి పేరు మల్లారెడ్డిపల్లి. ఆ గ్రామంలోని వారందరూ ముస్లింలే. మనం మనిషి చితాభస్మాన్ని పవిత్రంగా భావించం. కానీ.. ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం ఆలయంలో మాత్రం మనిషి చితాభస్మంతోనే శివుడిని అభిషేకిస్తారు. ఇలా ఆయా ప్రాంతాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సంప్రదాయాలు ఉంటాయి. సరిగ్గా అలాంటిదే కర్ణాటక హాసన్ జిల్లా బేలూరులోని అత్యంత పురాతన చెన్నకేశవ స్వామి ఆలయం.
ఈ ఆలయంలో ఏటా వసంతకాలంలో నిర్వహించే రథోత్సవంలో ఖురాన్‌ను పఠించడం అత్యంత ఆశ్చర్యం కలిగించే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఆలయ పునర్ నిర్మాణానికి ముస్లిం రాజు తోడ్పటంతో అందుకు గుర్తుగా.. కృతజ్ఞతగా ఈ ఆచారం మొదలైనట్లుగా ఆలయ చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతోంది. 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హోయసలరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. బేలూరు హోయసలులకు రాజధానిగా ఉండటంతో ఇక్కడ అనేక ఆలయాలు కనిపిస్తాయి.
ఒక్కో ఆలయానిది ఒక్కో రీతి. కానీ.. విష్ణుమూర్తి అవతారమైన చెన్నకేశవ స్వామి ఆలయమే ఇందులో అతిపెద్దది. అలాగే.. ఆచారాలు కూడా. యగాచి నది ఒడ్డున నెలకొన్న ఈ ఆలయ నిర్మాణాన్ని 1117లో విష్ణువర్ధనుడు ప్రారంభించారు. ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం ‘విజయ నారాయణ’ ఆలయం పేరుతో దీనిని ప్రారంభించారు. 103 ఏళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. 1404 నాటికి ప్రస్తుతమున్న రూపానికి చేరుకుంది. ఈ కాలంలో హొయసల రాజులు అనేక మంది మారారు. కానీ.. ఆలయ నిర్మాణాన్ని మాత్రం నిలపివేయలేదు. ఆలయ ప్రాంగణంలో ఒక్కో నిర్మాణాన్ని చేపట్టారు.
ఆ ఆలయం విశిష్టత ఏమిటంటే.. మహాభారతం, రామాయణంలోని గాథల చిత్రాలతోపాటు జైనం, బౌద్దానికి చెందిన చిత్రాలను కూడా చెక్కారు. హొయసల రాజ్యాన్ని విజయనగర రాజులు కూడా ఆక్రమించుకుని పరిపాలించారు. కానీ.. విజయనగర రాజులతో ఢిల్లీ సుల్తానేట్లతో యుద్ధం నేపథ్యంలో ఈ ఆలయం దెబ్బతిన్నది. అయితే ఒడయార్ వంశస్తుల తరపున ఈ ప్రాంతంలో పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న హైదర్ అలీ1774లో ఈ ఆలయాన్ని పునర్ నిర్మించారు. ఇందుకు కావాల్సిన నిధులను కేటాయించారు. అయినా ఆలయం పూర్తిగా పునర్ నిర్మాణం కాలేదు.
కొద్ది రోజుల తర్వాత ఆలయానికి ముందున్న పెద్ద గోపురం ఒక్కసారిగా కూలిపోయింది. అప్పటి నుంచి అది అలాగే ఉంది. చివరగా1935లో ఆనాటి మైసూరు ప్రభుత్వం ఒడయార్ వంశస్తుల సహాయంతో తిరిగి ఆలయాన్ని పునరుద్ధరించింది. ఈ క్రమంలో హైదర్ అలీ చేసిన కృతజ్ఞతగా ఏటా జరిగే రథోత్సవంలో ఖురాన్ ను పఠించడం ప్రారంభమైనట్లుగా ఆలయ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో హిజాబ్ వంటి వివాదం వెలుగులోకి వచ్చినా ఆలయ అధికారులు, పురోహితులు మాత్రం రెండుమూడు రోజుల క్రితం నిర్వహించిన ‘రథోత్సవాన్ని ‘ఖురాన్’ పఠనం ద్వారా ప్రారంభించడం విశేషం.