ఆ ఊర్లు దీపావళి టపాసులకు దూరం ఎందుకో తెలిస్తే పొగడక మానరు!

-

దీపావళి.. జరుపుకోబోతున్నాం. ఈ పండుగ వస్తే చాలు పిల్లలు, పెద్దలు అందరూ టపాకాయలు అవేనండీ బాబు బాంబులు పెద్ద ఎత్తున కాల్చి సంబురపడి పోతారు. ఆ సంబురాలు చివరకు ప్రకృతి విపత్తుకు దారితీసే స్థాయికి వెళ్లాయి. దీంతో సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు పెట్టింది. కానీ దేశంలో రెండు గ్రామాలు మాత్రం రెండు దశాబ్దాలుగా దీపావళి బాంబుల మోత లేకుండా నిశ్శబ్దంగా చేసుకుంటున్నాయి. ఎందుకో తెలిస్తే మనం వారి మంచి మనస్సుకు.. నిజమైన మానవత్వానికి ఫిదా అయిపోతాం. ఆ వివరాలు తెలసుకుందాం…

తమిళనాడులో శివగంగ జిల్లాలోని కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు మాత్రం బాంబులు కాల్చడానికి దూరం. వీరు సుప్రీం ఆదేశాలకు పాతికేండ్ల ముందు నుంచే బాణాసంచా కాల్చకూడదనే తీర్మానం చేసుకున్నారు. ఈ రెండు గ్రామాలు కూడా వెట్టంగుడి బర్డ్‌ సాంక్చురీలో భాగంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడికి చలికాలం కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయి. సైబీరియా, న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన పక్షులు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని మళ్లీ ఎండకాలం ప్రారంభం కాగానే ఆయా ప్రదేశాలకు వెళ్లిపోతాయి. ఇక్కడే గుడ్లు పెటి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోతాయి.

టపాసులు ఎందుకు కాల్చరంటే…?
పాతికేండ్లకు పూర్వ ఈ ప్రాంతంలో అందరిలాగే ఇక్కడ బాంబులు కాల్చేవారు. అయితే టపాయకాయల మోతకు వలస వచ్చిన పక్షలు భీతిల్లిపోయేవి. పక్షులు పొదిగే గుడ్ల నుంచి పిల్లలు కూడా సరిగా బయటికి వచ్చేవి కావు. కొన్నిసార్లు పక్షులు అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయేవి. ఈ పరిస్థితులను గమనించిన రెండు గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లో బాణాసంచా కాల్చకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ గ్రామాల్లో ఏ దీపావళికి కూడా బాణాసంచా కాల్చడం లేదు. కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాల్లో ఎప్పుడూ బాణాసంచా కాల్చడం చూడలేదని ఆ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులు తెలిపారు. వారి మానవత్వం అదే వారి హృదయఘోష కారణం వారి మాటల్లో… ‘మనుషులమైతే బాణాసంచా శబ్దం భరించలేకపోతే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాం, చెవుల్లో దూది పెట్టుకుంటాం. మరి ఆ పక్షులు ఈ భయంకరమైన శబ్దాలను ఎలా భరించాలి” అని ఆ గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మన ఆనందం కోసం పక్షులను క్షోభ పెట్టడం ఏమిటి అనేది వాళ్ల భావన. దీపావళికే కాక గ్రామాల్లో జరిగే ఏ ఇతర వేడుకల్లో కూడా వారు బాణాసంచా కాల్చరు.

చూశారా ఆ గ్రామాల ప్రజల మానవత్వం. ప్రపంచంలో మనతోపాటు నివసిస్తున్న సమస్త జీవరాశికి ప్రమాదం కలగకూడదనే వారి ఆలోచన అందరికీ ఆదర్శం కావాలి. మీరూ పెద్దపెద్ద శబ్దాలు, కాలుష్యం ఎక్కువగా చిమ్మే టపాసులకు దూరంగా ఉండండి. అందాల దీపాల వరుసలతో దీపావళి చేసుకోండి. అంతేకాదండోయో కేవలం టపాసులే కాదు ప్రకృతిలోని జీవరాశికి ప్రమాదం తెస్తున్న సెల్‌లలను కూడా మితంగా వాడటం చేస్తే మరీ మంచిది.
– కేశవ

 

Read more RELATED
Recommended to you

Latest news