తెలుగు వారాలల్లో ఆదివారం చాలా గొప్పది. సాక్షాత్తు సూర్యభగవానుడికి సంబంధించిన రోజు. సంస్కృతమున భానువారంగా పిలువబడుతోంది. ఇంకా చెప్పాలంటే భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో “రవివార్”గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమనిబంధనలు పరిశీలిస్తే.. ఆదివారం ఉదయాన్నే సూర్యస్త్రోత్రం పఠించడంతో పాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిది. సూర్యస్తోత్రం తర్వాత ఆలయ దర్శనం గావించి, ఎరుపు పువ్వులు స్వామికి సమర్పించడం ఉత్తమమని వారు పండితులు పేర్కొంటున్నారు.
అయితే ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని, అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. భానువారమున సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి. గోధుమలతో తయారు చేసే వంటకాలు చపాతీ, పూరీ వగైరాలను ఆదివారం రోజున భుజించినట్లైతే ఆరోగ్యదాయకమని జ్యోతిష్య శాస్త్ర కర్తలు వెల్లడిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతీ ఆదివారం ఇలా చేస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితుల అభిప్రాయం.
– కేశవ