మలేజా నైవేద్యం ఈ ఆంజనేయస్వామికి ప్రత్యేకం ఎక్కడో తెలుసా !

-

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం పోయే దారిలో నల్లమల అడువుల్లో వెలిసిన ఆంజనేయస్వామే పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం. ఈ ఆలయం అత్యంత మహిమాన్వితం. తెలంగాణ, ఆంధ్ర నుంచేకాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయం అచ్చంపేట నుంచి శ్రీశైలం పోయేదారిలో మనన్నూరుకు దగ్గరలో ఉంటుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం… మన్ననూరు దగ్గర ఎడమవైపు రోడ్డు మొదట్లో శ్రీ పబ్బతి వీరాంజనేయస్వామి ఆలయ మార్గాన్ని సూచించే కమాను ఉంది. మన్ననూరునుంచి 52 కి.మీ.ల దూరంలో ఆలయం ఉంది. ఇక్కడ భక్తులు సమర్పించే నైవేద్యం ప్రత్యేం దాన్ని మలేజా అంటారు ఆ వివరాలు తెలుసుకుందాం…


ఈ ఆలయం వున్నది పాత మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉంది. ఆలయం మరీ పెద్దది కాదు. కానీ అపురూప మహిమకలది. ఆలయం వెలుపల పెద్ద ధుని. ఆ ధుని అలాగే 365 రోజులూ వెలుగుతూనే వుంటుందిట. పెద్ద వానలవ్వీ వచ్చినప్పుడుకూడా ఏదో తాత్కాలిక ఆఛ్ఛాదన వేస్తారుట గానీ మరీ షెడ్డులాగా ఏమీ లేదు. అయినా ఆ ధుని ఇప్పటిదాకా ఎప్పుడూ ఆరలేదుట. అది స్వామి మహత్యం అంటారు.

ఆలయ చరిత్ర

పూర్వం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బట్టలుతుక్కుంటూ వుండేవారుట. వారు బట్టలు పిండి పక్కనే వున్న బండమీద వేసేవారుట. అలా వేసినప్పుడల్లా వేసినవారికి కాళ్ళు నెప్పులూ వగైరాలతో బాధపడేవారుట. ఏమటా అని ఒకసారి ఆ రాతిని పరిశీలనగా చూస్తే స్వామి ఆకారం కనబడింది. వెంటనే తమ తప్పు తెలుసుకుని, ఆ విగ్రహాన్ని నిలబెట్టి, దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేయసాగారు. వారే అక్కడ దొరికిన సామాగ్రితో నాలుగు గోడలు, పైన కప్పు వేశారు. సరిగా లేకపోవటంవల్ల ఆ గోడలు, కప్పూ కూలినా, స్వామి విగ్రహానికి ఏమీ కాలేదుట. స్వామి మహత్యం అందరికీ తెలియజేయటానికే అలా జరిగిందనుకున్నారు.
ఇంకొక కధనం ప్రకారం స్వామి స్వయంభూ. చెట్టు తొఱ్ఱలోంచి ఉద్భవించారు. నైఋతి దిక్కుగా, కొంచెం వంగినట్లు వుండే స్వామి విగ్రహాన్నినిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నంచేసినా కుదరలేదు. ఇప్పటికీ విగ్రహం కొంచెం ఒరిగినట్లే వుంటుంది. ఈ స్వామిగురించి అందరికీ తెలిసింది శ్రీ మాని సింగ్ బావూజీవల్ల. ఈయన ఫోటో ఆలయంలో వున్నది. ఈయనే ఆలయం వెలుపల ధుని ఏర్పాటు చేసింది. ఇక్కడ వుండే లంబాడీ వారికీ, చెంచులకీ ఈ స్వామి మీద అపరిమితమైన గురి. ఈ దేవాలయాన్ని మద్దిమడుగు ఆంజనేయస్వామిగా కూడా పిలుస్తారు. మద్దిమడుగు స్వామి అత్యంత మహిమాన్వితుడుగా భక్తులు కొలుస్తారు.

మలేజా నైవేద్యం ప్రత్యేకం

పబ్బతి ఆంజనేయస్వామికి ఇక్కడ వారు హోమగుండంలో ఒక ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. దేంటో తెలుసా గోధుమ పిండి, బెల్లం కలిపి మలేజా అని తయారు చేస్తారు. దానిని ఇక్కడికొచ్చిన ప్రతివారూ ధునిలో నివేదన చేస్తారు. ఇద్దరు స్త్రీలు ప్రదక్షిణలు చేస్తూ, ఈ మలేజా వుండలు చిన్నవి హోమంలో వెయ్యటం చూశాము. ఇదేకాక స్వామికి పాదుకలు సమర్పించటం కూడా ఇక్కడి భక్తులకు అలవాటు. శనివారంనాడు ఇక్కడికి భక్తులు బాగా వస్తారు. ఇక్కడే వండుకుని తిని, రాత్రి నిద్ర చేసి మరునాడు వెళ్తారు.

ఇంతకీ పబ్బతి అంటే ఏమిటని అక్కడి పూజారిగారినడిగితే అక్కడి గిరిజనుల భాషలో పబ్బతి అంటే ప్రసన్న, శాంతమూర్తి అని అర్ధమట. ఈ స్వామిని పునః ప్రతిష్టించినవారు శ్రీ హంపీ పీఠాధిపతి. స్వామికి కుడిపక్కన ఎదురుగా శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామిని ప్రతిష్టించారు. అమాయక గిరిజనులు అమిత విశ్వాసంతో కొలిచే ఈ స్వామి ఆలయానికి హైదరాబాదునుంచీ రోజూ మూడు బస్సులు నడుపబడుతున్నాయి. దేవరకొండ, అచ్చంపేటనుంచి కూడా బస్సులున్నాయి.
దర్శన సమయాలు: ఉదయం 4-30 నుంచి 1 గంటదాకా మళ్ళీ సాయంత్రం 3 గంటలనుండీ 9 గంటలదాకా తెరచి ఉంటుంది.
ఇక్కడకు ఎక్కువగా ఆంజనేయస్వామి మాల వేసుకున్నవారు వస్తుంటారు. అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ స్వామని కొలుస్తారు. ప్రకృతి రమణీయత, నల్లమల అడివి అందాల మధ్యలోయలో, చక్కటి ఈ దేవాలయం తప్పక చూడాల్సిన ఆధ్యాత్మిక కేంద్రం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news