శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్ సిరీస్‌లో తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్, ఎస్20 అల్ట్రాతోపాటు మరో నూతన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జడ్ ఫ్లిప్‌ను తాజాగా విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ ఈ ఫోన్లను విడుదల చేసింది. ఇక ఇంతకు ముందు నుంచి భావిస్తున్న విధంగానే శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఎస్11కు బదులుగా ఎస్20 సిరీస్ ఫోన్లను విడుదల చేయడం విశేషం. మరి ఈ ఫోన్లలో శాంసంగ్ అందించిన ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..!
గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్…
గెలాక్సీ ఎస్20 ఫోన్‌లో 6.2 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, ఎస్20 ప్లస్‌లో 6.7 ఇంచుల సైజ్ ఉన్న అదే తరహా డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. రెండు ఫోన్ల డిస్‌ప్లేలు 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. ఇక ఈ ఫోన్లలో ఆయా దేశాల మార్కెట్‌లకు అనుగుణంగా స్నాప్‌డ్రాగన్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెసర్‌లు లభిస్తాయి. వీటిలో 5జీ ఫీచర్‌ను ఆప్షనల్‌గా అందిస్తున్నారు. అలాగే డిస్‌ప్లేల కింది భాగంలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ డివైస్‌లను చాలా వేగంగా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. అలాగే శాంసంగ్ బిక్స్‌బీ, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే యాప్‌లను కూడా అందిస్తున్నారు.
గెలాక్సీ ఎస్20 ఫోన్ వెనుక భాగంలో 3 కెమెరాలను ఏర్పాటు చేశారు. 12 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్‌తోపాటు మరో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్, 64 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్‌ను అందిస్తున్నందున ఫోన్ కదులుతున్నప్పటికీ ఫొటోలు షేక్ అవకుండా వస్తాయి. ఇక గెలాక్సీ ఎస్20 ప్లస్‌లో ఈ కెమెరాలతోపాటు అదనంగా డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లకు ముందు భాగంలో 10 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ల ద్వారా 8కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లలో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4000/4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్ తదితర ఇతర ఫీచర్లను అందిస్తున్నారు.
గెలాక్సీ ఎస్20, ఎస్20 ప్లస్ ఫీచర్లు…
* ఎస్20 – 6.2 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3200 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఎస్20 ప్లస్ – 6.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3200 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 / ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 990 ప్రాసెసర్
* ఎస్20 – 8/12 (5జి) జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* ఎస్20 ప్లస్ – 8/12 (5జి) జీబీ ర్యామ్, 128/256 (5జి)/512 (5జి) జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 12, 64, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, ఎస్20 ప్లస్ – డెప్త్ విజన్ కెమెరా
* 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
* డాల్బీ అట్మోస్, అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
* ఎస్20 – 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్
* ఎస్20ప్లస్ – 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్
గెలాక్సీ ఎస్20 అల్ట్రా…
గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 6.97 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి కూడా 120 హెడ్జ్ రిఫ్రెష్ ఫీచర్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో వినియోగదారులకు లభిస్తుంది. 5జి ఫీచర్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. 16జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 10, శాంసంగ్ బిక్స్‌బీ, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.
గెలాక్సీ ఎస్20 అల్ట్రా ఫోన్‌లో వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్, 48 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్‌ను కూడా ఈ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. అందువల్ల 100ఎక్స్ సూపర్ రిజల్యూషన్ జూమ్ పొందవచ్చు. ఇక మరో డెప్త్ సెన్సార్‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ముందు భాగంలో 40 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ద్వారా కూడా 8కే వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. అలాగే ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిసెన్స్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్ తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా ఫీచర్లు…
* 6.9 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3200 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 / ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 990 ప్రాసెసర్, 12/16 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 108, 48, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, డెప్త్ విజన్ కెమెరా, 40 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 5జి, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్ షేర్
గెలాక్సీ ఎస్20 4జీ వేరియెంట్ ధర 981 డాలర్లు (దాదాపుగా రూ.69,980) ఉండగా, 5జీ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.71,325)గా ఉంది. ఇక గెలాక్సీ ఎస్20 ప్లస్ 5జి వేరియెంట్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1199 డాలర్లు (దాదాపుగా రూ.85,590) ఉండగా, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1299 డాలర్లు (దాదాపుగా రూ.92,720)గా ఉంది.
గెలాక్సీ ఎస్20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ మోడల్ ధర 1399 డాలర్లు (దాదాపుగా రూ.99,840) ఉండగా, 16జీబీ + 512జీబీ వేరియెంట్ ధర 1499 డాలర్లు (దాదాపుగా రూ.1,06,975)గా ఉంది.
ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఫోన్లకు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. మార్చి 6వ తేదీ నుంచి వీటిని మార్కెట్‌లో విక్రయించనున్నారు. ఇక ఈ ఫోన్లు భారత్‌లో ఎప్పుడు విడుదలయ్యేది, వాటి ధర వివరాలను శాంసంగ్ వెల్లడించలేదు.