మన పూర్వీకులు నిర్మించిన ఆలయాల విశిష్టత తెలుసా ?

-

భారతదేశంలో ఆలయాలు అపూర్వం. అద్భుతం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ నాడు నేటి ఆధునిక సాంకేతికత లేదు. కానీ వారు నిర్మించిన దేవాలయాలు, శిల్ప సంపద, కట్టడాలు నేటికి చెక్కుచెదరకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈ విశేషాలపై ప్రముఖ పండితులు, సమన్వయ సరస్వతిగా పేరుగాంచిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఆయా సమయాల్లో ప్రవచనాలలో చెప్పిన యదార్థ విషయాలు తెలుసుకుందాం….

మనం ఆలయాన్ని చూసినప్పుడు ఏదో చూస్తాం, దణ్ణం పెట్టుకుంటాం, వస్తాం. కానీ ఆలయం చూసే చూపు ఒకటి ఉంది. ఎలా చూడాలి? అని. అలా చూసినట్లయితే ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క జ్ఞానాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే మన భారతదేశ ప్రాచీనత, చారిత్రకంగానూ, వైజ్ఞానికం గానూ, ఇతరత్రా కూడా భారతదేశం సాధించిన ఔన్నత్యం, తెలుస్తుంది. ఒక్కొక్క అద్భుతమైన ఆలయ సంపదను చూసినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆలయాలు ఎంత అద్భుతమైన సాంకేతక విజ్ఞానంతో ఎలా నిర్మాణం చేశారా? అని ఆశ్చర్యం కలుగక మానదు. అయితే మనం ఆ దృష్టితో చూడడం కంటే పాశ్చాత్యులు ఆ దృష్టితో చూసి ఒక్కొక్క ఆలయంయొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్తూంటే మనం ఆశ్చర్యపోతూంటాం. నిజంగా చిదంబర నటరాజు గురించి నాకు ఎక్కువగా కృషి చేయాలి అని ఉత్సాహం రావడానికి కారణం పాశ్చాత్య గ్రంథాలు. అవి ప్రధానంగా మూడు.

  1. David Smith అనే ఆయన Dance of Shiva అని కొన్ని వందల పేజీల గ్రంథాన్ని రచించారు. అందులో చిదంబర క్షేత్ర మహాత్మ్యాన్ని అద్భుతంగా కీర్తించి చిదంబర నటరాజుకు సంబంధించిన సంస్కృత వాజ్ఞ్మయం గురించి ఆయన ఉటంకించినటువంటి శ్లోకాలు అవీ చూస్తె ఆశ్చర్య పోయాం. ఆయన అంతగా సంస్కృతం అధ్యయనం చేసి వాటిలోని అంతరార్థాలు వ్యాఖ్యానిస్తూ వాటికి సమయస్ఫూర్తిగా ఇటు వేదంలోంచి, ఇతర ఆగమాలలోంచి ఆయన Quotations ఇస్తూ ఉంటే ఎంత అధ్యయనం చేశాడా అనిపిస్తుంది. ఉమాపతి అనే మహాపండితుడు, భక్తుడు రచించినటువంటి “కుంచింతాన్ఘ్రి స్తవం” అని ఒక స్తోత్రం ఉంది. చిదంబర నటరాజును ఆధారం చేసుకొని స్తోత్ర వాజ్ఞ్మయం, ప్రత్యేకమైన రిసెర్చ్‌ ఆయనని ఆధారం చేసుకొని పుట్టిన స్తోత్ర సాహిత్యం ఒక్కటీ మనం పరిశీలించుకు వెళితే అందులో ఉన్న యోగ రహస్యాలు, ఉపాసనా రహస్యాలు, మంత్ర యంత్ర సంకేతాలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. అంతేకాదు చిదంబర క్షేత్రానికి వెళ్ళే శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి రచన చేశారు అని కొంతమంది పరిశోధకులు తేల్చి చెప్పిన మరొక అంశం. ఎందుకంటే సుందరీ అన్న పేరున్నటువంటి తల్లి ఈ క్షేత్రంలోనే ఉంది. కామ సుందరి. కామసుందరి అన్నప్పుడు మహాకామేశ్వరి. శివకామసుందరి అని చెప్పబడుతున్నది. అయితే ఉమాపతి అనే అతను కుంచితాన్ఘ్రి స్తవం రచిస్తే దానికి David Smith ప్రతి పదానికి అద్భుతమైన వ్యాఖ్యానం రచించాడు ఇంగ్లీషులో. అది చదవడం జరిగింది. అదేవిధంగా Fritjof Capra అనే అతను “Tao of Physics” అనే పుస్తకంలో Cosmic Dance of Shiva అని ఒక ప్రత్యేకమైన ప్రకరణంలో ఆ శివుని నాట్యాన్ని విశ్వంలో జరుగుతున్న, ప్రతి అణువులో జరుగుతున్నటువంటి చైతన్యంతో పోల్చి చక్కగా చూపిస్తూ ప్రతి అణువులోనూ, బ్రహ్మాండంలోనూ అణువు అంటే micro, బ్రహ్మాండం అంటే macro – విస్తారంగా చూస్తే విశ్వం, సూక్ష్మంగా చూస్తే అణువు. అయితే విశ్వమంతా ఏ చైతన్యం ఉందో అణువులో అదే చైతన్యం ఉంది అని విజ్ఞాన శాస్త్రం చెప్తున్నదీ, మనయొక్క వేదాంత శాస్త్రం దాన్నే చెప్తున్నది. అంతటా ఏ బ్రహ్మముందో నాలోనూ అదే బ్రహ్మముంది అన్నారు కదా శంకర భగవత్పాదుల వారు. కనుక ఆ బ్రహ్మ చైతన్యం పిపీలికాది బ్రహ్మ పర్యంతం వ్యాపించింది. పిపీలికం అంటే అత్యల్ప పరిమాణం గల పదార్ధం. బ్రహ్మ ప్రర్యంతం అంటే విస్తారమైన పదార్ధం వరకు. కనుక సూక్ష్మం మొదలుకొని స్థూలం వరకు అంతటా ఉన్నది ఒకటే బ్రహ్మ పదార్త్ధం అనేటటువంటి ఏ వేదాంత విజ్ఞానం ఉన్నదో దానినే “అణోరణీయాన్మహతో మహీయా” అని చెప్తున్నాం. కనుక అణువునందు కదిలే చైతన్యమూ, బ్రహ్మాండంలో నిరంతరం కదిలే చైతన్యమూ ఈ చైతన్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ చైతన్యం ఎప్పుడూ లయాత్మకంగా ఉంటుంది. అవునా? లేదా? లయ, Rythm అన్నమాట. అంటే ఒక పధ్ధతి కలిగిన కదలికతో జగత్తు అంతా నడుస్తున్నది. ఆ లయని, చైతన్యాన్నే మనం నాట్యం అని చెప్తున్నాం. కనుక ఆ నటరాజు లయకారకుడు అనే విషయాన్ని ఇంత అద్భుతమైన కోణం విజ్ఞాన శాస్త్రం సహకారంతో Dr. Fritjof Capra చెప్పాడు. అతను ఒక పాశ్చాత్య అణుశాస్త్రవేత్త, అదేవిధంగా భౌతిక శాస్త్ర వేత్త. ఆ తరువాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా నటరాజ విగ్రహానికి చాలా గుర్తింపు ఉంది. విదేశాలలో కూడా భారతీయ సంస్కృతికి ఒక ప్రతీకగా నటరాజ విగ్రహాన్ని భావన చేస్తారు పాశ్చాత్యులు. అటు తర్వాత Dr. Kennet Ford అనే ఒక అణుశాస్త్రవేత్త ఆయన కూడా శివనాట్యంపై చాలా పరిశోధనలు చేసి విశేషమైన అంశములు రచించారు. ఎందుకు ముందు పాశ్చాత్యులవైపు నుంచి వచ్చాను అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా పరిశోధనలు చేసి మన ఆలయాలు సంస్కృతి వీటిగురించి పరిశోదిస్తూ ఉంటే మనం వాటి గురించి వినం సరికదా చెప్పడం మొదలు పెడితే శ్రద్ధ కూడా చూపించం. కునికిపాట్లో నిద్దర్లో ఇలాగే గడిచిపోతూ ఉంటాయి మనకి. కానీ శ్రద్ధగా పరిశోధిద్దాం, తెలుసుకుందాం అనే తపన మనకి కరువవుతోంది. ఆ తపన ఉన్నవాళ్ళు చేసిన వైపు నుంచి మనం వస్తున్నాం. కానీ ఈ రహస్యములు ఇప్పుడు వీళ్ళు ఆవిష్కరించి చెప్పిన ఇవే వైజ్ఞానిక రహస్యాలు మన వేద వేదాంత శాస్త్రములు చాలా అద్భుతంగా వివరించాయి.
  • కేశవ

Read more RELATED
Recommended to you

Latest news