సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో గ్రహ బలాలు బాగుండవు, ఆ సమయంలో పరిహారం కోసం మొదట చేసేది నవగ్రహ ప్రదక్షిణం, పూజలు. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు సాధారణంగా పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం..
నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదర్శనలకు ఒక విశిష్టత ఉంది. శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అనుమతి కోరుతూ, తన వివరాలు తెలుపుతూ… ఫలానా వాడిని ప్రదక్షిణకు వచ్చానని చెబుతూ చేసే ప్రదక్షిణం మొదటిది. నవగ్రహ అధిపతి అయిన సూర్యునికి చేసేది రెండవ ప్రదక్షిణం. ప్రదక్షిణలు చేయాలనే బుద్ధిని ప్రసాదించినందులకు చేసే ప్రదక్షిణం మూడవది. ఇలా మూడు ప్రదక్షిణాలకు అంతరార్థం ఉందని పెద్దలు అంటారు. ప్రదక్షిణం చేసేటపుడు.. మనస్సు, తనువు అన్నీ భగవంతునిపై దృష్టి పెట్టడం వలన ప్రదక్షిణం శరీరంలోని, మనస్సులోని బాధలను హరించివేస్తుంది.. అందువలన కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా.. వ్యక్తిగతంగా ఉఛ్ఛస్థితికి చేరుకోవచ్చు
రాహుకేతువులకు అప్రదక్షణం చేసే సంప్రదాయం ఉంది. అదేవిధంగా శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం, మంగళవారం ఏడు, తొమ్మిది, 11, 21 ప్రదక్షిణలు చేస్తుంటారు. అదేవిధంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలను చదువుకుంటే మంచిది. లేదా ఆయా గ్రహాల నామాలను, వర్ణాన్ని తలుచుకుంటూ ప్రదక్షిణ చేస్తే మరీ మంచిది. అదేవిధంగా శని అనుగ్రహం కోసం చేసేవారు వేంకటేశ్వరస్వామి లేదా శివుడు, ఆంజనేయ సంబంధ నామాలు, చాలీసా లేదా పంచాక్షరీ, అష్టాక్షరీలను జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి.
– కేశవ