రథయాత్ర సమయంలో భక్తులు ఆలయం వద్ద పోటెత్తుతారు. దీంతో ఈ రథయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల జూలై 4వ తేదీన పూరీ జగన్నాథ్ రథయాత్ర జరగనుంది.
మన దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరీ జగన్నాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ముఖ్యంగా ప్రతి ఏటా జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహించే జగన్నాథ రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. రథయాత్ర సమయంలో భక్తులు ఆలయం వద్ద పోటెత్తుతారు. దీంతో ఈ రథయాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల జూలై 4వ తేదీన పూరీ జగన్నాథ్ రథయాత్ర జరగనుంది. దీంతో భక్తులు ఈ సారి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరి ఆ దేవాలయానికి ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒడిశాలోని పూరీ ప్రాంతంలో ఉన్న జగన్నాథ్ ఆలయానికి చాలా సులభంగా వెళ్లవచ్చు. పూరీ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. ఇక పూరీకి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు రవాణా సదుపాయం ఉంది. అలాగే భువనేశ్వర్ బిజూ పట్నాయక్ విమానాశ్రయం చేరుకుంటే అక్కడి నుంచి పూరీకి 60 కిలోమీటర్ల దూరం వస్తుంది. దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి పూరీకి రైళ్లను నడుపుతున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి పూరీ జగన్నాథ్ ఆలయానికి 58 కిలోమీటర్ల దూరం వస్తుంది. అందువల్ల భువనేశ్వర్ వెళ్లినా పూరీకి సులభంగా చేరుకోవచ్చు.
కాగా కోల్‌కతా, విశాఖపట్నంల నుంచి పూరీకి ప్రత్యేకంగా బస్సులను కూడా నడుపుతున్నారు. ఇక హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ ఎయిర్ పోర్టు లేదా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటే అక్కడి నుంచి పూరీకి సులభంగా వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు ఎయిరిండియా, ఇండిగో, గో ఎయిర్, విస్తారా తదితర విమాన కంపెనీలు విమాన సర్వీసులను నడుపుతున్నాయి. వాటి ద్వారా హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి షాలిమార్ ఎక్స్‌ప్రెస్, గౌహతి ఎక్స్‌ప్రెస్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లలోనూ భువనేశ్వర్‌కు చేరుకోవచ్చు. వీటిలో చాలా రైళ్లు విశాఖ పట్నం, విజయవాడల నుంచి కూడా వెళ్తాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉండేవారు కూడా ఈ రైళ్ల ద్వారా భువనేశ్వర్‌కు చేరుకోవచ్చు. అలాగే విజయవాడ, విశాఖపట్నంల నుంచి పలు ప్రత్యేక రైళ్లను కూడా భువనేశ్వర్‌కు నడుపుతున్నారు. వాటి ద్వారా కూడా ప్రయాణికులు భువనేశ్వర్‌కు చేరుకుని అక్కడి నుంచి పూరీ వెళ్లి అటు నుంచి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు..!