తొలి ఏకాదశి విశిష్టత.. ఈ వ్రతం చేస్తే శివకేశవులతోపాటు అమ్మ అనుగ్రహం

-

ప్ర‌తీ సంవ‌త్స‌రం 24 ఏకాద‌శులు వ‌స్తాయి. అయితే ఆషాడంలో వ‌చ్చే ఏకాద‌శిని తొలి ఏకాద‌శిగా పిలుస్తారు. శ‌య‌నైక ఏకాద‌శి, హరి వాస‌ర‌మ‌ని, పేలాల పండుగ‌గా కూడా పిలుస్తారు. ఈ పండును తొలి పండుగ‌గా జ‌రుపుకోవ‌డం ఆచారం.

భారతీయ సంప్రదాయంలో తొలి పండుగగా పిలువబడే తొలి ఏకాదశికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో రెండోది బహుళ (కృష్ణ)పక్షంలో వస్తాయి. ఇక అధికమాసం వస్తే మరో రెండు అధికంగా అంటే 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతాలల్లో ఏకాదశి వ్రతం అత్యంత కీర్తిగాంచింది. చాలా పవిత్రమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా గా పిలుస్తారు. దీనికే శయనైకాదశి అని హరి వాసరమని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు.

Importance Of Toli Ekadasi

చాతుర్మాస్య దీక్ష ప్రారంభం

ఆషాఢం నుంచి నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, బాధ్రపదం, కార్తీకమాసం ఈ నాలుగునెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయణంలో పండుగలు… పర్వదినాలు ఎక్కువగా వస్తాయి.. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ముఖ్యంగా వర్షకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటుచేశారు.

ఏకాదశినాడు ఎందుకు ఉపవాసం ఉండాలి?

పూర్వం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

ఏకాదశి వ్రతం ఎలా చేయాలి?

సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైగా ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతిమాసంలో ఏకాదశి వ్రతం ఏలా ఆచరించాలో తెలుసుకుందాం.. ఏకాదశికి ముందు రోజు అంటే దశమిరోజు రాత్రి పూట భోజనం చేయకూడదు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లుపాలు తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశిరోజు ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకుని తమతమ కార్యాక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అయితే పైన పేర్కొన్న వారు మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్ర పారాయణాలు చేయాలి. వీలైతే తప్పక గోపూజ చేయండి.

చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలుకాకుంటే నిద్రపోయే వరకు విష్ణునామస్మరణ చేసుకోండి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతఃకాలంలోనే లేచి యధావిధిగా నిత్యకాలకృత్యాలు, దేవతారాధన చేసుకుని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిభుక్కుల కింద కనిపించే, కనిపించని జీవరాశికి ఇంటిబయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి. ఈ సారి తొలి ఏకాదశి శుక్రవారం వచ్చింది.. శుక్రవారం శివుడికి, అమ్మవారికి, వేంకటేశ్వరస్వామికి చాలా ప్రీతికరం. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి.. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. శివకేశవులతోపాటు అమ్మ అనుగ్రహం లభిస్తుంది.

ఈ రోజున పేలాల పిండి ఎందుకు తినాలి..?

తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news