నవరాత్రులు తొమ్మిదోరోజుకు చేరుకున్నాయి. తొమ్మిదోరోజు అమ్మవారిని మహిషాసురమర్దినిగా ఆరాధిస్తారు. ఈ రోజు అమ్మవారికి విశేష పూజలు చేయాలి. ఆయుధపూజ, వాహనపూజలు నిర్వహించడం చేస్తారు.
ధ్యానశ్లోకం:
మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా,
జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ
అవతార విశేషాలు:
నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.
చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందు కుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం. చాలా దేవాలయాల్లో ఈ రోజు అమ్మవారిని మహాకాళీగా అలంకరిస్తారు. కుంభాన్ని పోసి, నింబఫలం నైవేద్యంగా సమర్పిస్తారు. కుష్మాండ బలి కూడా ఇస్తారు.
చండీ ఆరాధన ఫలితాలు:
చండీరూపం అంటే దుష్టశక్తుల నివారణకు ప్రతీక.
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. చండీ పారాయణం, చండీ ధ్యానం, చండీ హోమం చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఇవన్నీ వీలుకాని వారు అమ్మను భక్తితో శుచితో ఇంట్లో లేదా దేవాలయంలో ఓం నమఃచండికాయేనమః అనే నామాన్ని కనీసం 108 సార్లు మనఃపూర్వకంగా ధ్యానిస్తే లేదా జపిస్తే అత్యంత ప్రభావవంతమైన ఫలితాలు కలుగుతాయి. దోషాలు నివారణ అవుతాయి. దుష్టశక్తుల నుంచి విముక్తి కలగడమే కాకుండా జయాలు కలుగుతాయి.
– కేశవ