గ్రహచారం.. గ్రహాల గమనం ఆధారంగా లెక్కిస్తారు. అయితే ఈ గ్రహాల గమనం మనచేతిలో లేదు. కానీ వ్యతిరేకంగా ఉన్న గ్రహాల ప్రసన్నం చేసుకోవడం, సవ్యంగా ఉన్నవాటిని మరింత అనుకూలంగా మార్చుకోవడానికి పలు రకాల ప్రక్రియలు ఉన్నాయి. అందులోనూ తక్కువ ఖర్చుతో తప్పక ఫలితాన్నిచ్చేవి అయితే అందరికీ ఉపయోగం. అలాంటి వాటిలో కార్తీకంలో వచ్చే బహుళ త్రయోదశినాడు ఈ కింది విధంగా చేస్తే చాలు గ్రహదోషాలు చాలావరకు శాంతిస్తాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం….
గ్రహానుకూలం లేకపోతే ఏదీ సాధించలేం. ఆయా గ్రహాధిపతుల ఇచ్ఛానుసారం మానవ మనుగడ ఉంటుంది. అందుకే.. ప్రతి ఒక్కరికీ నవగ్రహారాధన చాలా ముఖ్యం. కానీ.. స్తోమత లేనివాళ్లకు ఇది బహు కష్టం. వాళ్ల కోసం కూడా కొన్ని పద్దతులను పెద్దలు సూచించారు. ప్రదోషవేళ అంటే… సూర్యాస్తమయం జరిగే రెండు గంటలూ… శివునికి ఇష్టమైన ఘడియలు. జగదంబతో కలిసి శివుడు తాండవమాడే ఆ సమయంలో… శివారాధన చేస్తే నవగ్రహాలూ శాంతిస్తాయ్. విశేష ఫలితాలిస్తాయ్. ముఖ్యంగా త్రయోదశినాడు వచ్చే ప్రదోషకాలం విశేషమైందని చెప్పాలి.
ఇక కార్తీక బహుళ త్రయోదశి అయితే.. దాదాపు శివరాత్రితో సమానం. ఆ రోజున ఉపవాసం ఉండి.. ప్రదోషవేళ శివాలయానికి వెళ్లి.. నేరుగా గుళ్లోకి వెళ్లకుండా నవగ్రహారాధన చేసి, పిదప కాళ్లు కడుక్కొని శివ దర్శనం చేయాలి. అలా చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్థాయి. కార్తీక బహుళ త్రయోదశి ఈ నెల 24న వచ్చింది. నవగ్రహదోషాలు ఉన్నవారు, లేనివారు అందరూ పైన చెప్పిన క్రియలను చేస్తే తప్పక వారిదోషాలు పోవడమే కాకుండా నవగ్రహాల ప్రసన్నత ఏర్పడి అత్యంత అనుకూల ఫలితాలు వస్తాయి.
– కేశవ