హయగ్రీవ అవతార విశేషాలు ఇవే !

-

విద్య.. సకలాన్ని ప్రసాదిస్తుంది. విద్య యశస్సు. విద్య భోగకరి. విద్య విదేశీ బంధువు అని ఒక కవి చెప్పినట్లు విద్య ఉంటే ఏలాగైనా బతుకవచ్చు. విద్య అంటే కేవలం మనం ప్రస్తుతం చదువుకుంటున్న స్కూల్ విద్య కాదు. అన్ని రకాల విద్యలు. అయితే ఈ విద్య రావడానికి ఆరాధించాల్సిన దేవుడు.. హయగ్రీవస్వామి. ఆ విశేషాలు తెలుసుకుందాం..

హయగ్రీవావతారం… పూర్వం గుర్రపుతల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు.

ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి నిర్వహిస్తారు.

హయగ్రీవ రూపం

హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వం) తల, నాలుగు చేతులు. శంఖం, చక్రం పై రెండు చేతులలో కలిగి ఉంటాడు. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి. ఏడమ చేతిలో పుస్తకం ఉంటుంది.
ఈ స్వామిని ఆరాధిస్తే సకల విద్యలు కరతలామాలకం అవుతాయని పురాణాల్లో ఉంది.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version