మీకు తరచూ కోపం, బాధ కలుగుతున్నాయా? ఒకే ఆలోచనలో ఎక్కువ సేపు ఉండిపోతున్నారా? దాన్నుండి బయటకు రావడానికి కష్టపడుతున్నారా? కొన్ని కొన్ని సార్లు అలా ఉండడమే బాగుందనిపిస్తుందా? ఐతే మీరు భావోద్వేగాలకి బందీ అయినట్టే. భావోద్వేగాలను నియంత్రించుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే ఇవి. ఇవి మానసికంగా మిమ్మల్ని బలహీనంగా మారుస్తాయి. జీవితంలో ముందుకు వెళ్దామనుకున్న ప్రతీసారి ఈ భావోద్వేగాలు మిమ్మల్ని వెనక్కు లాగుతూనే ఉంటాయి. చిత్రమేంటంటే, మీరు కూడా అలా లాగడంలోనూ ఎమోషనల్ గా ఫీల్ అవుతారు.
అందుకే దాన్నుండి వీలైనంత తొందరగా బయటపడాలి. లేదంతే జీవన విధానంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి.
భావోద్వేగాలకి బందీ కాకుండా వాటి నుండి బయటకి వచ్చేందుకు ఏం చేయాలో తెలుసుకోండి.
స్వీయ అవగాహన
ఏదైనా విషయమై బాధపడుతున్నప్పుడు అసలు అంత బాధపడాల్సిన అవసరం ఉందా అని ఆలోచించండి. బాధని పెద్దగా చూస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రతీదీ భూతద్దంలో చూస్తునారేమో సరిగ్గా చూడండి. ఇది మీకు ఏది సరైన బాదో, దేనికి ఎంత బాధపడాలో తెలియజేస్తుంది.
కొత్త దారి వెతకండి
భావోద్వేగాలతో సతమతం అవుతున్నప్పుడు ఒంటరిగా ఉండకండి. ఒంటరితనం భావోద్వేగాలని మరింత పెంచుతుంది. స్నేహితులని పిలవండి. లేదా మీరే స్నేహితులతో వెళ్ళండి.
నిశితంగా గమనించండి
భావోద్వేగాన్ని కలుగజేసే బాధను నిశితంగా పరిశీలించండి. నిజానికి నువ్వు అంతగా బాధపడేంత అర్హత దానికి లేదేమో! అనవసరంగా ఎక్కువ బాధపడుతున్నావేమో!
నిపుణుల సహాయం తీసుకోండి
కొన్ని సార్లు పైన చెప్పినవేమీ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు నిపుణుల సాయం తీసుకోవడం ఉత్తమం. మీకు తెలియని విషయమేదో వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది.