ఆవు పేడతో గణేష్ విగ్రహాల తయారీ.. వాటితో అన్నీ లాభాలే ఉంటాయట..!

పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాలను మాత్రమే వాడాలని స్వచ్ఛంద సంస్థలు, పర్యావేరణ వేత్తలు ఇస్తున్న పిలుపుకు గత కొద్ది సంవత్సరాలుగా విశేష రీతిలో స్పందన లభిస్తోంది.

పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాలను మాత్రమే వాడాలని స్వచ్ఛంద సంస్థలు, పర్యావేరణ వేత్తలు ఇస్తున్న పిలుపుకు గత కొద్ది సంవత్సరాలుగా విశేష రీతిలో స్పందన లభిస్తోంది. అందులో భాగంగానే ఏటా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేయబడిన వినాయకుడి విగ్రహాలను వాడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే కేవలం మట్టితోనే కాకుండా ఆవు పేడతోనూ వినాయకుడి విగ్రహాలను తయారు చేయవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. అంతేకాదు.. ఆ విగ్రహాల వల్ల మనకు పలు ఇతర లాభాలు కూడా ఉంటాయని ఆయన అంటున్నారు. ఇంతకీ ఆయనెవరు, ఏం చేస్తున్నారంటే…

this doctor makes eco friendly ganesh idols using cow dung

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా ఖర్ఘర్ అనే ప్రాంతానికి చెందిన డాక్టర్ నవ్‌నాథ్ దుధల్ గత 25 ఏళ్లుగా టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో పనిచేసి ఆ తరువాత జాబ్‌కు రిజైన్ చేశారు. అప్పటి నుంచి ఆయన దేశీయ ఆవు జాతులను సంరక్షించడంతోపాటు ఆర్గానిక్ లైఫ్ గడపాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఏటా ఆయన ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలను తయారుచేస్తూ చాలా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ఆవు హిందువులకు పవిత్రమైంది కనుక.. దాన్నుంచి వచ్చే పేడతో తయారు చేసే వినాయకుడి విగ్రహాలు కూడా పవిత్రమైనవే అంటారాయన.

డాక్టర్ నవ్‌నాథ్ దుధల్ ప్రస్తుతం తన సొంత ఊరైన ఉస్మానాబాద్‌లోని తన ఆయుర్వేద షాపులో సదరు ఆవుపేడ గణనాథుల విగ్రహాలను విక్రయిస్తున్నారు. అయితే ఆయన అక్కడే ఉన్న తన వర్క్‌షాపులో ఆ విగ్రహాలను ఎలా తయారు చేయాలో 7 రోజుల్లోనే ఎవరికైనా సరే ఉచితంగానే నేర్పిస్తారు. ఆవుపేడకు కొద్దిగా సహజసిద్ధమైన జిగురు కలిపి ఒక ప్రత్యేకమైన ఆకృతిలో పోత పోసి అనంతరం వచ్చే బొమ్మను బయటకు తీస్తారు. ఆ తరువాత ఆ బొమ్మ ఎండడానికి కనీసం 7 రోజుల సమయం పడుతుంది.

అయితే ఆ విగ్రహాన్ని పూజించాక ఇంట్లోనే బకెట్లో నిమజ్జనం చేస్తే వచ్చే ద్రవాన్ని ఇంట్లోని మొక్కలకు ఉపయోగించవచ్చు. అదే పెద్ద విగ్రహాలు అయితే పంటలకు ఎరువుగా వాడవచ్చు. ఇక సముద్రం, చెరువుల్లో ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తే ఆవు పేడలో ఉండే మంచి బాక్టీరియా సముద్ర జీవులకు మేలు చేస్తుంది. ఆ నీటిలో ఉండే హానికారక క్రిములు నశిస్తాయి. అలా ఆవుపేడతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాల వల్ల అన్నీ లాభాలే కలుగుతాయి. కానీ నష్టం ఏమీ ఉండదు. ఇక డాక్టర్ నవ్‌నాథ్ దుధల్ ప్రస్తుతం 3 నుంచి 10 ఇంచుల పొడవైన ఆవుపేడ వినాయకుడి విగ్రహాలను అమ్ముతున్నారు. వాటి కనీస ధర రూ.50 నుంచి గరిష్ట ధర రూ.350 వరకు ఉంటుంది. ఏది ఏమైనా.. ఆయన చేస్తున్న ఈ పనిని అందరం అభినందించాల్సిందే..!