మరో మూడ్రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోతోంది. సెప్టెంబర్ నెల షురూ కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వినాయక చవితి సందడి కూడా మొదలైంది. చందాల కోసం పిల్లలు, యువకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మండపాల తయారీ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భారీ వినాయక విగ్రహాల కోసం ముందస్తుగా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు.
మరికొన్ని రోజుల్లో రాబోతున్న గణేశ్ చతుర్థి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 19 నుంచి జరగబోయే గణేష్ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల సుమారు 32 వేల500 గణేష్ మండపాలు ఏర్పాటుకానున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు హాజరయ్యారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి.. నిమజ్జనాలు జరిగేంత వరకు గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని స్పష్టం చేశారు.