Tulsidas Jayanti 2024 : గోస్వామి తులసీదాసు ఒక గొప్ప కవి. ఆయన 1532 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని రాజపూర్ (ప్రస్తుత బండా జిల్లాలోనిది) గ్రామంలో జన్మించారు. తులసీ దాస్ జీవిత కాలంలో 12 పుస్తకాలు రాశారు. హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఒకనిగా భారతదేశ చరిత్రలో నిలిచాడు. ఆయన రచనలు, ఆయన కళారంగ సేవలు, భారతదేశ సంస్కృతి, ఈ సమాజంలో విశేష ప్రభావం చూపాయి. ఆయన రామగాథలు, నాటకాలు, హిందూస్థానీ సాంప్రదాయ సంగీతం, పాపులర్ సంగీతం, టెలివిజన్ సీరియళ్ళు హిందువులని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
తులసీ దాస్ శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీ మూలంలో అందించిన మొట్టమొదటి కవి. అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్ చాలీసాను కూడా తులసీ దాస్ రచించాడు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతటా ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా “హనుమాన్ చాలీసా”ను అన్ని భాషలవారూ పరమభక్తితో పఠిస్తారు. అంతటి గొప్ప కవి తులసీ దాస్.
ఈ సంవత్సరం, తులసీదాస్ 527వ జయంతిని ఆదివారం, ఆగస్టు 11న అనగా రేపు జరుపుకుంటారు. తులసీదాస్ జయంతి నాడు, ఆయన్ని అభిమానించే ప్రజలు, శిష్యులు గోస్వామి తులసీదాస్ సాహిత్యంలో మునిగి తేలి ఆయన వారసత్వాన్ని గౌరవిస్తారు. ముఖ్యంగా రామచరిత్మానాలు ఇళ్లలో, దేవాలయాలలో వింటారు. చాలా మంది భక్తులు రాముడు, హనుమంతునికి అంకితమైన దేవాలయాలను కూడా సందర్శించి ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోని అనేక దేవాలయాలలో తులసీదాస్ విగ్రహాలు ఉన్నాయి.ఇక్కడ ఆయన గౌరవార్థం ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.
ఈ పవిత్రమైన రోజున భక్తులు తరచుగా దానధర్మాలు చేయడం, విరాళాలు ఇవ్వడం మరియు పేదలకు ఆహారం ఇవ్వడంలో పాల్గొంటారు.తులసి దాస్ శిష్యులు రాముడు మరియు హనుమంతుడిని ఎక్కువగా పూజిస్తారు. తులసీ దాస్ వారణాసిలో సంకటమోచన్ దేవాలయాన్ని కట్టించాడు. దీనిని రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా కట్టించాడని ప్రతీతి. ఈ దేవాలయం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి దక్షిణ దిక్కులో ఉంది. ఇక్కడ రామ, హనుమంతుని భక్తులు తులసి దాస్ జయంతి నాడు ప్రత్యేక పూజలు చేస్తుంటారు.