చంద్ర‌బాబుకు భారీ షాక్‌..? బీజేపీలో చేర‌నున్న టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీలు..?

-

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితోపాటు మ‌రో 5 మంది టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి త్వ‌ర‌లో బీజేపీలో చేరుతార‌ని తెలుస్తోంది.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది గంప గుత్త‌గా ఒకేసారి టీఆర్ఎస్‌లో చేరిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే టీ కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షాన్ని తెరాస శాస‌న స‌భాప‌క్షంలో విలీనం చేయాల‌ని గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌కు లేఖ ఇవ్వ‌గా.. ఒక్క రోజులోనే ఆ ప్ర‌క్రియ పూర్త‌యింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఏపీలోనూ ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీకి కూడా స‌రిగ్గా ఇలాంటి క‌ష్టాలే ఎదుర‌వ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఆ పార్టీకి చెందిన 5 మంది రాజ్య‌స‌భ ఎంపీలు బీజేపీలో చేర‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానితోపాటు మ‌రో 5 మంది టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి త్వ‌ర‌లో బీజేపీలో చేరుతార‌ని తెలుస్తోంది. మ‌రో 5 ఏళ్ల వ‌ర‌కు ఏపీలో ఎలాగూ వైసీపీయే అధికారంలో ఉంటుంది, ఆ త‌రువాత కూడా టీడీపీ అధికారంలోకి వ‌స్తుందా.. అంటే అనుమాన‌మే. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే వ‌య‌స్సు అయిపోవ‌డంతో మ‌రో 5 ఏళ్ల త‌రువాతైనా టీడీపీ అధికారంలోకి వ‌చ్చే పరిస్థితి ఉంటే.. ఆయ‌న సీఎం అవుతారా.. ఆ త‌రువాత పార్టీ బాధ్య‌త‌ల‌ను ఎవ‌రు చూసుకుంటారు.. లోకేష్ అస‌మ‌ర్థుడు కావ‌డం.. క్షేత్ర స్థాయిలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉండ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇక ఏపీలో టీడీపీకి భ‌విష్య‌త్తు లేద‌ని భావిస్తున్న ఆ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు తెలిసింది.

టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీలు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్, టీజీ వెంక‌టేష్‌, గ‌రిక‌పాటి మోహ‌న్ రావు, తోట సీతారామ‌ల‌క్ష్మిలు టీడీపీని వీడి బీజేపీలో చేరుతార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే మ‌రోవైపు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాం మాధ‌వ్, కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిలు ఆ ఎంపీల‌తో పార్టీ మార్పుపై చ‌ర్చిస్తున్న‌ట్లు కూడా తెలిసింది. ఈ క్ర‌మంలో వారు నిజంగానే టీడీపీని వీడి బీజేపీలో చేరితే అప్పుడు చంద్ర‌బాబుకు భారీ షాక్ త‌గులుతుంద‌ని కూడా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కాగా రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తుతం 245 మంది స‌భ్యులు ఉన్నారు. బీజేపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయేకు ఆ స‌భ‌లో 102 మంది స‌భ్యులు ఉన్నారు. అయితే కీల‌క‌మైన బిల్లుల‌ను పాస్ చేయించుకునేందుకు ఎన్‌డీఏకు మ‌రో 21 మంది స‌భ్యులు కావాలి. అందువ‌ల్లే బీజేపీ ఇత‌ర పార్టీల‌కు చెందిన రాజ్య‌స‌భ ఎంపీల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీసిందని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మరి ఆ టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీలు బీజేపీలో చేరుతారా.. లేదా.. అన్న‌ది మ‌రికొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version