మైండ్ గేమ్…ప్రజల మైండ్ మార్చే గేమ్..నేటి రాజకీయాల్లో ఇదే జరుగుతుంది… ప్రజల మైండ్ మార్చి..వారిని తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా సరే పార్టీలు తమ పనితీరుతో ప్రజలని మెప్పించి, వారి మద్ధతు పొందాలి గాని…కానీ నేటి రాజకీయాల్లో అది కనబడటం లేదు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి మైండ్ గేమ్ వాడుతూ…వారిని వీక్ చేసి లబ్ది పొందాలనేది నేటి రాజకీయ పార్టీల వ్యూహం.
ముందు అధికార వైసీపీ అదే మైండ్ గేమ్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే…ఆ పార్టీ పదే పదే యెల్లో మీడియా, చంద్రబాబే అని మాట్లాడుతుంది. తాము ప్రజలకు మంచి పనులు చేస్తున్నా సరే…యెల్లో మీడియా విషయ ప్రచారం చేస్తుందని, చంద్రబాబు తమపై ఎప్పుడు విషం చల్లుతున్నారని వైసీపీ చెప్పుకొస్తుంది. అయితే ఇది పూర్తిగా మైండ్ గేమ్ అనొచ్చు. ఎందుకంటే మొదట మీడియా గురించి వస్తే….వైసీపీకి అనుకూల మీడియా సంస్థలు చాలా ఉన్నాయి..ఇక సొంత మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు తమకు మీడియా మద్ధతు లేనట్లు..టీడీపీ అనుకూల మీడియాని టార్గెట్ చేయడం మైండ్ గేమ్.
అలాగే తాము మంచి పనులు చేస్తున్నామని, అధికారం అంటే అహంకారం కాదని, అధికారమంటే ప్రజలమీద మమకారమని నిరూపిస్తూ ఈ మూడేళ్ల పాటు ప్రజల కోసమే పనిచేశామని తాజాగా జగన్…ప్లీనరీ సమావేశాల్లో అన్నారు. అయితే మూడేళ్లలో వైసీపీ నేతల అహంకారంతో పనిచేయలేదా? అంటే దానికి ప్రజలే సమాధానం చెబుతారని చెప్పొచ్చు. ఇక మంచి పనులు అంటే..పథకాలు అమలు చేయడం ఒక్కటే కాదు..అభివృద్ధి కూడా చేయాలి. అలాగే ప్రజలపై పన్నుల భారం పెంచకూడదు. కానీ ఇవి జగన్ ప్రభుత్వం చేసిందా? అంటే దీనికి కూడా ప్రజల దగ్గరే సమాధానం ఉంది. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్.
టీడీపీ మైండ్ గేమ్ విషయానికొస్తే…పదే పదే టీడీపీ చెప్పేది ఒక్కటే…జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సర్వ నాశనం అయిందని, బాబు ఉంటే బాగుండేది అని..అలాగే జగన్ ఫ్యామిలీ గురించి పదే పదే మాట్లాడుతుంటారు. అయితే జగన్ వల్లే రాష్ట్రం నాశనమైందా? లేదా? అనేది ప్రజలకు తెలుసు…అంతకముందు చంద్రబాబు పాలన ఎలా ఉందో కూడా తెలుసు. ఇక జగన్…తల్లిని, చెల్లికి అన్యాయం చేశారని, అలాగే వివేకా హత్యా కేసుని పదే పదే ప్రస్తావిస్తుంటారు. అంటే కుటుంబానికే అన్యాయం చేసిన జగన్…రాష్ట్రానికి ఏం చేస్తారనేది టీడీపీ కోణం. ఇక టీడీపీ అనుకూల మీడియా జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడానికే చూస్తూ ఉంటుంది. ఇదంతా టీడీపీ మైండ్ గేమ్.
అంటే రెండు పార్టీలు చేసేది ఒకటే…తమని తాము పైకి లేపుకోవడం..ప్రత్యర్ధిని దెబ్బతీయడం..ఇలా చేసి ప్రజల మద్ధతు పెంచుకుని అధికారం దక్కించుకోవాలనేది రెండు పార్టీల మైండ్ గేమ్ పాలిటిక్స్. మరి ఈ మైండ్ గేమ్ పాలిటిక్స్ లో చివరికి ఎవరు గెలుస్తారో చూడాలి.