ప్రస్తుతం భద్రాచలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది. దీన్ని ఏపీలో కలిపే ప్రతిపాదనపై అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని తెలిసింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించిన విషయం విదితమే. అయితే తెలంగాణలో ఉన్న కీలక ప్రాంతమైన భద్రాచలాన్ని ఏపీకి అప్పగించాలనే సరికొత్త ప్రతిపాదనను ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదుట ఉంచుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా ఈ విషయంపై కేసీఆర్ కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడీ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే భద్రాచలాన్ని ఏపీకి ఇవ్వడం సాధ్యమవుతుందా.. అందుకు ప్రజలు ఒప్పుకుంటారా..? అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం భద్రాచలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది. దీన్ని ఏపీలో కలిపే ప్రతిపాదనపై అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్ లో భేటీ అయిన సీఎంలు కేసీఆర్, జగన్‌లు భద్రాచలం అంశంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే భద్రాచలాన్ని ఏపీలో కలిపేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారట. ఈ క్రమంలో ఈ నిర్ణయం ఆచరణలోకి రావాలంటే ముందుగా ఇరు రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం ఆ తీర్మానాలను కేంద్రానికి పంపితే వారు పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి తీర్మానాలను ఆమోదిస్తారు. ఆ తరువాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సదరు ప్రాంతం ఏపీలో కలిసిందని చెబుతారు.
అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా జరిగేందుకు గతంలో ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని మినహాయించి 7 మండలాలను ఏపీలో కలిపారు. ఈ క్రమంలో అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, టీఆర్ఎస్ ఇలా 7 మండలాలను ఏపీలో కలపడం అన్యాయం అని ఆందోళనలు చేశాయి. అయితే ఇప్పుడు ఏకంగా భద్రాచలాన్నే ఏపీలో కలుపుతామంటుడడంతో మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు జరగవచ్చని అందరూ భావిస్తున్నారు.
అయితే నిజానికి 1959 కి ముందు భద్రాచలం రెవెన్యూ డివిజన్ తూర్పు గోదావరి జిల్లాలో ఉండేది. కానీ పరిపాలనా సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక, ప్రాథమిక సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో భద్రాచలం డివిజన్‌ను ఆ తరువాత ఖమ్మంలో కలిపారు. అప్పటి నుంచి భద్రాచలం ఖమ్మంలోనే ఉంది. అయితే 2014లో రాష్ట్ర విభజన అనంతరం పోలవరం కోసం భద్రాచలం తప్ప మిగిలిన మండలాలను ఏపీలో కలిపారు.
కాగా భద్రాచలం ప్రాంతం ఒక్కటే తెలంగాణలో ఉండగా చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం ఏపీలోనే ఉంది. దీంతో భద్రాచలం వాసులు పాలనా పరంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఐటీడీఏ, విద్య, వైద్యం, మౌలిక వసతుల పరంగా ఏజెన్సీ వాసులు, గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రిని ఏపీలో కలపడమే ఉత్తమమని పలువురు చెబుతున్నారు. దీంతో భద్రాచలాన్ని తప్పనిసరిగా ఏపీలో కలపాలనే వాదన క్రమంగా బలపడుతోంది. అయితే ఈ విషయంలో నిర్ణయం మాత్రం అంత తేలిగ్గా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. అటు భద్రాచలం పౌరులే కాదు, ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందని తెలిసింది. అందుకని ముందుగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని కూడా ఆలోచిస్తున్నారట. అది ఓ కొలిక్కి వస్తే.. భద్రాద్రిని ఏపీలో కలపడమా, వద్దా.. అన్న విషయంలో స్పష్టత రానుంది..!