వార్తలంటే ప్రామాణిక భాషలో మాత్రమే చెప్పాలి అనే దగ్గర నుండి తెలుగులో ఉన్న ఏ యాసలోనైనా వార్తలు చెప్పవచ్చు, అలా చెబితే ఆ వార్తలు ఇంకా ఎక్కువ మందికి చేరుతాయన్న ఉద్దేశ్యంతో చాలా వార్తా సంస్థలు తెలంగాణ మాండలికంలో వార్తలు చదవడం ప్రారంభించాయి. తెలంగాణలో వార్తలు చెప్పడం అంటే ఒకరితో కూర్చుని ముచ్చట పెడుతున్నట్టే ఉంటది. అలా ముచ్చట చెప్పడంలో సిద్ధ హస్తులయిన కొందరిలో సుజాత ఒకరు.
టెలివిజన్ లో తీన్మార్ కార్యక్రమం ద్వారా పరిచయమైన సుజాత, ఆ తర్వాత జోర్దార్ ముచ్చట్లు చెబుతూ జోర్దార్ సుజాత గా పేరు తెచ్చుకుంది. ఐతే ముచ్చట్ల ద్వారా కొందరికే పరిచయమైన సుజాత, బిగ్ బాస్ షో ద్వారా అందరికీ పరిచయమయ్యింది. తెలుగు బిగ్ బాస్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన సుజాత, తనదైన ఆటతీరుతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. మొదట్లో కళ్యాణి గారితో గొడవ, ఆ తర్వాత రోబో టాస్కులో పట్టింపు, మొదలగు వాటి వల్ల అందరి దృష్టిలోకి వచ్చింది.
ఐతే బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. ఉన్న కొద్ది రోజుల్లో బలమైన ముద్ర వేసింది. బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ కారణంగా ప్రతీ ఒక్కరూ షోకి రావాలనుకుంటారు. కానీ వచ్చిన వాళ్ళందరూ పాపులర్ అవుతారన్న గ్యారంటీ లేదు. హౌస్ లో తమదైన ముద్ర వేస్తేనే ఆ పాపులారిటీ పనిచేస్తుంది. అలా ముద్ర వేసిన వారిలో సుజాత ఒకరు.
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన సుజాత, జోర్దార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఎలిమినేషన్ టైంలో ఎవ్వరినీ బ్లేమ్ చేయకుండా చాలా ఉత్సాహంగా వచ్చిన సుజాత తెలంగాణ మాండలికంలో వార్తల ముచ్చట్లు చెబుతూ, అందరి ఇళ్ళలో కనిపిస్తూనే ఉంది. ఈ రోజు సుజాత పుట్టినరోజు సందర్భంగా మనలోకం తరపున సుజాత గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.