కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అటు దేశ ప్రధాని మోదీ ప్రసంగం కోసం భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినట్లే.. తెలంగాణలోనూ.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం రాష్ట్రవాసులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సంచలన విషయాలను చెప్పడంలో కేసీఆర్ స్టైలే వేరు. ఏ విషయాన్నయినా ఆయన సూటిగా, సుత్తి లేకుండా చెబుతారు. అందుకనే ఆయన ప్రెస్ మీట్‌లో చెప్పే విషయాలను వినేందుకు కేవలం తెలంగాణ వాసులే కాదు.. అటు ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
అయితే లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో కేసీఆర్ మే 5వ తేదీన చివరిసారిగా ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో మద్యం షాపులను ఓపెన్ చేయడంతోపాటు పలు కీలక విషయాలను ఆయన ఆ సమావేశంలో వెల్లడించారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ మరో ప్రెస్‌మీట్ ద్వారా ప్రజల ముందుకు రానున్నారు. దీంతో ఆయన ఆ సమావేశంలో ఏం చెబుతారా.. అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే. కాగా లాక్‌డౌన్ సడలింపులు, కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ నేడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పలు కీలక అంశాలను సీఎం కార్యాలయ వర్గాలు అజెండాగా సిద్ధం చేశాయి. హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో వైరస్ కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో ప్రజా రవాణాను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్‌టీసీ బస్సులను పరిమిత సంఖ్యలో.. సామాజిక దూరం పాటిస్తూ నడిపించనున్నారని తెలిసింది. ఈ మేరకు కేసీఆర్ ఈ విషయాలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఇక రాష్ట్రంలోని వలస కూలీల సమస్యలు, ధాన్యం సేకరణ, పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు అమలు చేయాల్సిన మార్గదర్శకాలు, 10వ తరగతి పరీక్షల నిర్వహణ.. తదితర పలు అంశాలను కూడా కేసీఆర్ ఇవాళ చర్చించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కూడా కేసీఆర్ తన స్పందనను తెలియజేయనున్నారని సమాచారం. దీంతో కేసీఆర్ ప్రెస్ మీట్‌పై ఆసక్తి నెలకొంది.