ఎడిట్ నోట్: కారు ‘రాజీనామా’..!

-

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశమవుతున్న విషయం ఏదైనా ఉందంటే అది మునుగోడు ఉపఎన్నిక గురించే…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అతి త్వరలోనే మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. అయితే ఏదైనా పార్టీలోకి వెళ్ళేవారు…రాజీనామా చేసే వెళ్ళడం అనేది మంచి సంప్రదాయం అని చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి…గెలిపించిన ప్రజలని, పార్టీని మోసం చేస్తూ..ఏ మాత్రం విలువలు లేకుండా..ఇంకో పార్టీలోకి జంప్ అయిపోతున్నారు.

రాజకీయాల్లో ఇలాంటి విలువలు లేని వలసలని ప్రజలు ప్రోత్సహించరనే చెప్పాలి…అయితే పార్టీలు మారాలా? వద్దా? అనేది నాయకులు ఇష్టమే…వారికి ఆ స్వేచ్చ ఉంది…కానీ ఒక పార్టీ తరుపున ప్రజాప్రతినిధిగా గెలిచి మరొక పార్టీలోకి వెళ్లాలంటే….ముందు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి…అప్పుడు పార్టీ మారడం అనేది మంచి ట్రెండ్ బీజేపీ మొదలుపెట్టింది. తమ పార్టీలోకి వచ్చే ప్రజాప్రతినిధులని…వారి పదవులకు రాజీనామా చేయించి..బీజేపీలోకి తీసుకుంటున్నారు. దీని వల్ల బీజేపీకి ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఈటల రాజేందర్ అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి…మళ్ళీ ఉపఎన్నికలో గెలిచారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అలా జరగలేదు…పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, ప్రత్యర్ధులని దెబ్బ తీయడం కోసం ఎడాపెడా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్‌ లో చేర్చుకున్నారు. అలా విలువలు పాటించకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్పేలా ఉన్నారు. ఇక ఇదే అంశాన్ని బీజేపీ ఒక అస్త్రం మాదిరిగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన వారందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. నైతిక విలువలుంటే ఉప ఎన్నికల్లో పోటీకి రావాలని అంటున్నారు.

ఇప్పుడు ఈ పాయింట్ తెలంగాణ రాజకీయాలని కీలక మలుపు తిప్పనుంది..నైతిక విలువలు…ఇవి లేని వారిని ప్రజలు ఆదరించేలా లేరు. పైగా రాజీనామా చేయకుండా జంపింగ్ చేసిన ఎమ్మెల్యేలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అలాగే వారికి ఎదుటవారిపై విమర్శలు చేసే అర్హత కూడా పెద్దగా ఉండదనే చెప్పాలి…వారు విమర్శలు చేసిన ప్రజలు నమ్మే పరిస్తితిలో ఉండరు.

టీఆర్ఎస్ లో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు…అయితే గతంలో గుత్తా ఎన్నిసార్లు పార్టీ మారారో చెప్పాల్సిన పని లేదు. పైగా 2014లో కాంగ్రెస్ తరుపున ఎంపీగా గెలిచి…పదవికి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇదే అంశాన్ని కోమటిరెడ్డి గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా టీఆర్‌ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్‌ రెడ్డికి తనను విమర్శించే నైతిక హక్కు లేదని అంటున్నారు. అంటే ఇప్పుడు పార్టీలు మారే ప్రజాప్రతినిధులకు రాజీనామా అనేది ముఖ్యమని చెప్పాలి. అయితే రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో చేరిన ప్రజాప్రతినిధులని…నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలే తిరస్కరించేలా ఉన్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రాజీనామా ఇప్పించేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version