ఒక్కటంటే ఒక విషాదం మానవ ఆవరణను శాసించే శక్తిని నిన్నటి వేళ నుంచి పొంది ఉంది. ప్రమాదం బాపట్లలో.. లేదా ప్రమాదం కృష్ణాలో లేదా ప్రమాదం మా శ్రీకాకుళంలో..ఇంకా ఇంకొన్ని చోట్ల కూడా ! ఎవరు ఎవరిని శాసిస్తున్నారు అన్న చర్చల్లో విలాసాలు విలయాలు విషాదాలు మరియు వికాసాలు ఆవిష్కృతం అయి ఉంటాయి. బాల్యాన్నే కాదు ప్రకృతితో మమేకం అయి సాగే చదువు కూడా తల్లిదండ్రులకు ఓ వికాసమే ! కానీ మనిషి తనని తాను దిద్దుకోవడంలో ఉంటే ప్రాయిశ్చిత్త సంబంధ కోరిక ఒకటి ఎన్నడూ ఎక్కడో ఆగి ఉంటుంది.
ఆ కోరిక విస్తృతం అయినా పశ్చాత్తాప చింతన అన్నది జీవిత కాలం వెన్నాడి తప్పులను దిద్దుకోమని కాలం ఆదేశించిన విధంగా ఉంటుంది. కానీ ఈ తప్పులు మన స్వయంకృతాలు మరియు స్వయం కృతార్థాలు కూడా ! అపరాధ సంబంధ భావన అవసరార్థం కూడా ప్రకృతే ఇస్తుంది. వినియోగించుకుని వదిలేయడం, మరిచిపోవడం మనిషి చేస్తున్న పని.. ఈ భావనల్లో మీరు ఉండండి.. మునగడం మరియు తేలడం అన్నవి మీ ఇష్టం..మునగడం లేదా ముంచి పోవడం అన్నవి మీ చేత.. మరియు మీ రాత కూడా !
మనుషులంతా ఏమౌతున్నారు. చెట్టూ చేమా పోయి అపార్ట్మెంట్ వచ్చిందక్కడికి. అప్పుడు మనుషులు కొండలు దాటి కోనలు దాటి కృతకం అనిపించినా నీడను దాచుకునే శరీరాన్ని దాచుకునే చోటు వెతకాలి. విలయానికి మొదటి మెట్టు అక్కడి నుంచి.. ఆ నిర్మాణం ఎక్కడిది ఏ చెరువు కప్పెట్టడం వలన వచ్చింది.. కబ్జా వల్ల వచ్చింది. కనుక తుఫానులు వచ్చి విలయాలు సృష్టిస్తే వానలను తిట్టుకోవడం కాదు మన పాపాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు. ప్రతి విషాదం ఇంతవరకూ మనిషికి మేలే చేసింది. విషాదమే లేకుండా ఉంటే కావ్య సృష్టే లేదు.
విషాదమే లేకుండా ఉంటే పునః సృష్టి అన్నదే లేదు. కనుక మీరు చేయాలనుకుంటున్న ఉద్దేశ పూర్వక అభివృద్ధిలో నేరం ఉంది. అది ప్రకృతి మాత్రమే గుర్తిస్తుంది.. మీరు పొందే శిక్ష కూడా ఏ న్యాయ స్థానం సాయం లేకుండానే ప్రకృతే విధించి అనుభవించేందుకు ఆస్కారం ఇస్తుంది. చావు, బతుకు అన్నవి ప్రకృతి నుంచి ప్రకృతి వరకూ ఉన్నాయి. కానీ గుర్తింపులో లేని చావులు మనలోనే ప్రతిరోజూ ఉంటాయి. ఇదొక్కటీ ఈ ఉదయం గుర్తిస్తే చాలు.. అన్యథా శరణం నాస్తి అని చదువుకోండిక !
రాక్షస వానలు అనే మాటలు రాయడంలో అర్థం కన్నా విషాదం ఎక్కువ ఉంది. గోడ కూలి బాలుడి మృతి.. తుఫాను కారణంగా ఓ కుటుంబానికో ఓ తల్లికో తీరని దుఃఖం. కనుక మనుషులను మింగేసే వానలను ఏమనాలి రాక్షస వానలే అని నిర్థారించి వెళ్లాలి. చెట్లు విరిగి, మనుషులు తల్లడిల్లి పల్లె కోనల్లో భయానక వాతావరణం ఒకటి విలయం చేయడం అంటే అది అక్కడి మనిషి తప్పిదమే కాదు చాలా మంది తప్పిదాల ప్రతిఫలం ఆ విషాదం.
మనుషులంతా ప్రకృతికి తగిన మూల్యం చెల్లించాలి. చేసే నష్టానికి భరణం చెల్లించాలి. చేస్తున్న కాలుష్యాన్ని నివారించడం చేతగాదు కనుక విషాదాలను మోయడంలో తప్పేం లేదు. అయితే ఇది సామూహిక విషాదం అయినా, వ్యక్తిగత జీవితాలను కదపి కుదిపేస్తున్న విషాదం అయినా ఒక్కటే !
వానలన్నీ మేలు చేస్తాయా అన్న ప్రశ్న దగ్గర నుంచి ఎండ కన్ను సోకి అలసిన దేహాలకు చేరిన వానలు మేలే చేస్తాయి అన్న మాట వరకూ ఏదో ఒక చోట కొంత సాంత్వన.. ఒకప్పుడు వాన రిలీఫ్ పాయింట్.. కానీ ఇప్పుడు ఓ ఇరిటేటింగ్ ఒన్. వానలు, ఎండలు మధ్య సంధి ఒకటి కుదిరితే ప్రకృతిలో ఓ సమతుల్యత అన్నది సాధ్యం అయి ఉంటుంది. మనుషుల్లో లేని సమతుల్యత ప్రకృతిలో ఎలా వస్తుందని.. చాలా వరకూ ప్రకృతి ప్రేమ అన్నది మేలు చేస్తుంది.
కానీ ప్రకృతి ప్రేమ పేరుతో నడిచే ఫొటోల ప్రేమే కొన్ని కొత్త విడ్డూరాలకు తావిస్తుంది. మనం ఏం చేస్తున్నాం ఎలా నడుచుకుంటున్నాం అన్నవి మన కన్నా ముందు ప్రకృతి మాత్రమే పసిగడుతుంది. మన జీవితాలను వడగడుతుంది. మన నడవడికి ప్రతిబింబ రూపం, అర్థ రూపం, క్రియా రూపం, విశేష రూపం, ఇంకా చెప్పాలంటే ఇప్పటి అసని కానీ నిన్నటి అంఫన్ కానీ ఇలాంటి తుఫాను లాంటి విషాద రూపం ప్రకృతే !