మే నెల‌లో లాక్‌డౌన్ ఉంటే.. జూన్‌లో EMI లు చెల్లించ‌డం క‌ష్ట‌మే..!

-

కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌ధాని మోదీ మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించిన విష‌యం విదిత‌మే. అయితే మ‌రో 3 రోజుల్లో ఆ గ‌డువు కూడా ముగియ‌నున్న నేప‌థ్యంలో ఇంకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా..? లేదా..? అని ప్ర‌జ‌ల‌కు సందేహాలు క‌లుగుతున్నాయి. ఇక దేశంలో ఈఎంఐలు, లోన్లు, క్రెడిట్ కార్డుల బిల్లులు క‌ట్టే వారి కోసం ఆర్‌బీఐ మే 31వ తేదీ వ‌ర‌కు వాటికి మిన‌హాయింపులు ఇస్తూ మార‌టోరియం తీసుకునే వెసులుబాటు క‌ల్పించింది. అయితే ఇప్ప‌టికే అనేక మంది ఉద్యోగులు విధుల‌కు దూర‌మై, తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్‌ను ఒక వేళ పొడిగిస్తే.. మే నెల‌లోనూ వారు పనిచేసే అవ‌కాశం దాదాపుగా లేదు. దీంతో ఆ త‌రువాత వ‌చ్చే జూన్ నెల‌లో వేత‌నాలు రావు. మ‌రి అలాంట‌ప్పుడు వారు ఈఎంఐలు ఎలా చెల్లిస్తారు..? ఇదే విష‌యం ఇప్పుడు వారిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

how people will pay emis if lock down extends in May

దేశంలో ఉద్యోగాలు చేసుకునే వారు మాత్ర‌మే కాదు, చిన్న మ‌ధ్య త‌ర‌హా వ్యాపారాలు చేసుకునే వారు, ప్రొఫెష‌న‌ల్స్‌, కారు డ్రైవ‌ర్లు.. త‌దిత‌ర అనేక రంగాల‌కు చెందిన వారు నెల నెలా తాము తీసుకున్న ప‌లు రుణాల నిమిత్తం ఈఎంఐలు చెల్లిస్తుంటారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఆర్‌బీఐ మార‌టోరియం అవ‌కాశం క‌ల్పించినా.. అది మే 31వ తేదీతో ముగుస్తుంది. నిజానికి ఆర్‌బీఐ ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.. మార్చిలో.. అప్ప‌టికే 3 నెల‌ల మారిటోరియంలో ఒక నెల అయిపోయింది. ఆ నెల దాదాపుగా ఈఎంఐలు చెల్లించేశారు. ఇక ఆర్‌బీఐ 3 నెల‌ల వ‌ర‌కు మారటోరియం అని అనౌన్స్ చేసినా.. టెక్నిక‌ల్‌గా అది 2 నెల‌లే ల‌భ్యమైంది. అయిన‌ప్ప‌టికీ చాలా మంది మార‌టోరియం సౌక‌ర్యం పొందారు. ఈ క్ర‌మంలో ఏప్రిల్ నెల అయిపోయింది. మే నెల ఆరంభం అవుతోంది. ఇక మ‌రో 30 రోజులు గ‌డిస్తే మార‌టోరియం గ‌డువు ముగిసి జూన్ వ‌స్తుంది. ఆ నెల‌లో ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపులు చేయాల్సిందే. కానీ మే నెల‌లో 3వ తేదీ త‌రువాత లాక్‌డౌన్‌ను పొడిగించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఇలాంటి త‌రుణంలో మే నెల‌లో కూడా ఉద్యోగులు ప‌నిచేసే అవ‌కాశం దాదాపుగా లేదు. నిత్యావ‌స‌రాలు, ఫార్మా త‌దిత‌ర రంగాల‌కు చెందిన వారు త‌ప్ప‌.. ఇత‌ర చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఉద్యోగులు, కార్మికులు కూడా మే నెల‌లో లాక్‌డౌన్ పొడిగిస్తే.. ప‌నిచేసే అవ‌కాశం అస్స‌లు లేదు. అలాంట‌ప్పుడు జూన్ నెల‌లో వారికి వేత‌నాలు ఎలా వ‌స్తాయి..? ఈఎంఐలు, ఇత‌ర చెల్లింపులు ఎలా చేస్తారు..?

అయితే లాక్‌డౌన్‌ను మ‌రికొద్ది రోజుల పాటు పొడిగించాల్సి వ‌స్తే.. అప్పుడు ఆర్‌బీఐ మార‌టోరియంపై మ‌రింత గ‌డువు పెంచే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినా.. ప‌రిస్థితులు య‌థాత‌థ స్థితికి వ‌చ్చేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది క‌నుక‌.. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రికీ ఆర్థిక స‌మ‌స్య‌లు చాలా ఉంటాయి. అందుక‌ని ఆర్‌బీఐ అన్ని విధాలా ఆలోచించి మార‌టోరియాన్ని మ‌రో 2 లేదా 3 నెల‌లు పెంచే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ఈ విష‌యంపై ఆర్‌బీఐ ఓ నిర్ణ‌యం తీసుకోక‌పోతే మాత్రం.. ఎంతో మంది తీవ్రంగా ఆందోళ‌న చెందే అవ‌కాశం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ ప‌రిస్థితి రావ‌ద్ద‌నే మ‌నం ఇప్పుడు ఆశించాలి..!

Read more RELATED
Recommended to you

Latest news