ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా వైకాపా ఏపీలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న నేపథ్యంలో తమ పార్టీ అధినేత జగన్ సీఎం అయితే ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైకాపా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల ఫలితాలతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. కొన్ని గంటల్లో ఏ పార్టీ భవితవ్యం ఏమిటో తేలిపోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేంద్రంలో బీజేపీకి, ఏపీలో వైకాపాకు పట్టం కట్టేశాయి. ఈ క్రమంలో ఆ పార్టీలకు చెందిన నేతలు ఫలితాల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక వైకాపా అధినేత జగన్ అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే తమ పార్టీయే అధికారంలోకి వస్తే.. సీఎంగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి ? అనే అంశంపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా వైకాపా ఏపీలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న నేపథ్యంలో తమ పార్టీ అధినేత జగన్ సీఎం అయితే ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైకాపా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే జగన్ మాత్రం ఈ నెల 30వ తేదీన.. అంటే ఫలితాలు వచ్చాక సరిగ్గా వారం రోజులకు సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఆ రోజున ముహూర్తం బాగుందని అందుకనే అదే రోజున జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.
ఇక ఈ నెల 30వ తేదీన జగన్‌తోపాటు మెజార్టీ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే ముందుగా 26వ తేదీన సీఎంగా ప్రమాణం చేయాలని అనుకున్నా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని.. అందుకే ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఇలాంటి అంశాల్లో జగన్ స్వరూపానందేంద్ర సూచనలను పాటిస్తున్నందునే ఆయన సూచనల మేరకే ప్రమాణ స్వీకారోత్సవ తేదీని వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే జగన్ సీఎం అయితే నిజంగానే 30వ తేదీన ప్రమాణం చేస్తారా, లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది..!