తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన కిషన్ రెడ్డికి కూడా ఈ సారి కేబినెట్‌లో స్థానం కల్పిస్తారని, ఆయనకు ఏదైనా ఒక కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారని సమాచారం అందుతోంది.
ఇటీవల జరిగిన దేశ వ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రాగా, మోదీ రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. అయితే మోదీ ప్రమాణం నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఉండబోయే మంత్రుల గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన కేబినెట్‌లో మొత్తం 60 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
ప్రధాని మోదీ కేబినెట్‌లో పలువురు సీనియర్లతోపాటు ఈ సారి కొత్తవారికి, అందులోనూ యువతకు అధికంగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయబోయే వారికి ఇప్పటికే ఫోన్లు చేసి విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అమిత్‌షాకు హోం శాఖ లేదా రక్షణ శాఖల్లో ఏదో ఒక శాఖ ఇస్తారని తెలిసింది. అలాగే విదేశాంగ శాఖకు ఈసారి సుష్మా స్వరాజ్‌ను ఎంపిక చేస్తారా లేదా కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్న విషయంలోకూడా సస్పెన్స్ కొనసాగుతుండగా, మరోవైపు జైట్లీ అనారోగ్య కారణాలతో ఈసారి కేంద్ర మంత్రి పదవిలో కొనసాగలేనని, పార్టీకి, ప్రభుత్వానికి సేవ చేస్తానని చెప్పారు. దీంతో ఆయన స్థానంలో ఆర్థిక శాఖకు ఈసారి ఎవరిని మంత్రిగా ఎంపిక చేస్తారోనని ఆసక్తిగా చర్చ నడుస్తోంది.
ఇక గతంలో మోదీ కేబినెట్‌లో ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌కు ఈ సారి వ్యవసాయ శాఖ ఇస్తారని తెలుస్తుండగా, గడ్కరీ, పీయూష్ గోయల్ లకు ఏ శాఖ కేటాయించేది ఇంకా తెలియరాలేదు. అలాగే స్మృతి ఇరానీకి ఈ సారి విదేశాంగ శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఇక నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్‌లు కూడా ఈ సారి మోదీ కేబినెట్‌లో కొనసాగుతారని సమాచారం. ఇక బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్‌కు చెందిన అనుప్రియా పటేల్‌కు మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. అలాగే మరిన్ని మిత్ర పక్షాలైన శివసేన, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ, అకాలీదళ్‌లకు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావిస్తున్నారు.
కాగా తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన కిషన్ రెడ్డికి కూడా ఈ సారి కేబినెట్‌లో స్థానం కల్పిస్తారని, ఆయనకు ఏదైనా ఒక కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారని సమాచారం అందుతోంది. అలాగే ప్రముఖ జర్నలిస్టు స్వపన్ దాస్ గుప్తాకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే మరోవైపు ఎన్‌డీఏలో చేరాలని వైకాపా అధినేత జగన్ భావిస్తే.. ఆ మేరకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఎంపీలకు కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించే అవకాశం ఉందని తెలిసింది. మరి చివరకు మోదీ కేబినెట్‌లో ఈ సారి ఎవరెవరు ఉంటారో.. వేచి చూస్తే తెలుస్తుంది..!