టీం ఇండియా ఆణిముత్యం అతను, ఎంతైనా ద్రావిడ్ శిష్యుడు కదా మరి…!

-

టీం ఇండియాలో అసలు ఓపెనర్ కెఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి…? అతను ఏ స్థానంలో ఆడితే బాగుంటుంది…? గత రెండేళ్ళు గా ఈ కర్ణాటక ఆటగాడి గురించి ఎప్పటికప్పుడు ఏదోక చర్చ నడుస్తూనే ఉంటుంది. పాపం టీంలోకి ఎప్పుడో వచ్చాడు గాని, టాలెంట్ ఉంది గాని ఎక్కడ ఆడాలో అర్ధం కాని పరిస్థితి ఈ ఆటగాడిది. ప్రతిభ ఉన్నా సరే అతను ఆడలేని పరిస్థితి. ఆడటానికి మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు గాని ఎక్కడ ఆడాలో అర్ధం కావట్లేదు.

ఓపెనర్ గా వచ్చాడు అనుకుంటే రోహిత్, ధావన్ లేదా మయాంక్ అగర్వాల్ తో ఇబ్బంది ఉంటుంది. జట్టు అవసరాల దృష్ట్యా పృథ్వీ షా ని తీసుకొచ్చారు అంటే రాహుల్ పరిస్థితి ఏంటో చెప్పలేము, మూడో స్థానంలో ఆడాలి అనుకున్నాడు అనుకుందాం, కోహ్లీ నుంచి కూడా అందుకు మద్దతు ఉంది. గత ఏడాది ఇంగ్లాండ్ లో ఆ అవకాశం ఇచ్చాడు కోహ్లీ. ఒక్క టి20 మ్యాచ్ లో మినహా ఎక్కడా ఆడలేదు.

మొన్న మూడో స్థానంలో అవకాశం ఇచ్చినా సరే అతను ఆకట్టుకోలేదు. ఇప్పుడు కోహ్లీ అతనితో ఒక ప్రయోగం చేసాడు. పోతే పోయిందని అయిదో స్థానంలో బ్యాటింగ్ కి పంపించాడు రాహుల్ ని. పూనకం వచ్చినట్టు చెలరేగిపోయాడు ఈ కర్ణాటక ఆటగాడు. జట్టుకి భారీ స్కోర్ అవసరం అనుకున్న సమయంలో కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు రాహుల్. కేవలం 52 బంతుల్లో 82 పరుగులు చేసి,

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చీకటి పడక ముందే చుక్కలు చూపించాడు. మొదటి వన్డేలో రాహుల్ కీపింగ్ కూడా చేసాడు. పంత్ ఉన్నా సరే రాహుల్ తో కీపింగ్ చేయించాడు కోహ్లీ. రెండో వన్డేలో అతను చేసిన మెరుపు స్టంప్ ఇంకా కొందరి కళ్ళల్లో మెదులుతూనే ఉంది. మిడిల్ ఆర్డర్ విఫలమవుతూ వస్తుంది. ఈ తరుణంలో ఆ ప్రాంతంలో ఒక కీలక ఆటగాడు, అవసరమైనప్పుడు దూకుడు ఉన్న ఆటగాడు కావాలి.

రాహుల్ ఇప్పుడు కీపింగ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి టీంకి అవసరమైన ఆటగాడు ఆ స్థానంలో దొరికినట్టే. ఇక్కడ చెప్పలేని దరిద్రం ఏంటీ అంటే, పొరపాటున రాహుల్ వచ్చే మ్యాచ్ లో ఆ స్థానంలో ఆడకపోతే అతని స్థానం మార్చి పైకి పంపిస్తారు. ఓపెనర్ గాయపడితే అక్కడ ఆడిస్తారు. అలా చేయకుండా ఉంటే రాహుల్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది. గతంలో రాహుల్ ద్రావిడ్ ఏ పాత్ర అయితే పోషించాడో అదే పాత్ర రాహుల్ పోషించాడు.

రాహుల్ ప్రతిభ ఉన్న ఆటగాడు, ఏ జట్టు అయినా సరే అతను నిలబడితే చాలు. అతన్ని టీం వాడుకోవాల్సిన అవసరం ఉంది. కోహ్లీ అతని విషయంలో ముందు నుంచి సానుకూలంగానే ఉన్నాడు. కాబట్టి అతన్ని జట్టు నుంచి తప్పించకుండా ఉంటే మంచిది. ముందు కీపింగ్ చేయకపోవడంతో రాహుల్ అలసిపోలేదు. బ్యాటింగ్ కి రావడంతో చెలరేగిపోయాడు. ఎంతైనా ద్రావిడ్ శిష్యుడు కదా మరి.

Read more RELATED
Recommended to you

Latest news