ఆరువేల ఏళ్లనాటి అమ్మాయి..!

శాస్త్రవేత్తలు ఒక చూయింగ్‌గమ్‌ ఆధారంగా ఆరువేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక అమ్మాయిని కనుగొన్నారు.

చరిత్ర తెలియాలంటే, అప్పుడు బతికున్నవాళ్లే రానక్కరలేదు. వారితో కలిసిమెలిసి ఉన్న వస్తువులు దొరికినా చాలు. చిన్నచిన్న వస్తువులే వేల ఏండ్లకిందటి చరిత్రను చెప్పే సమర్థత కలిగిఉంటాయి. ఇలాంటి ఘటనే తాజాగా డెన్మార్క్‌లో వెలుగుచూసింది. శాస్త్రవేత్తలు చూయింగ్‌ గమ్‌ వంటి పదార్థం సహాయంతో దాదాపు ఆరువేల ఏండ్ల కిందట జీవించిన యువతి జన్యుక్రమాన్ని, అప్పట్లో ఆమె నోటిలో జీవించిన సూక్ష్మక్రిముల ఉనికిని గుర్తించారు. క్రీ.పూ 10,000-4,500 ఏండ్ల మధ్య కాలాన్ని నియోలిథిక్‌ యుగంగా పిలుస్తుంటారు. డెన్మార్క్‌లోని లోలాండ్‌ ద్వీపంలో ఉన్న ఓ ఎండిపోయిన ఉప్పునీటి మడుగులో శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపగా.. రెండు సెం.మీ. పొడవున్న చూయింగ్‌ గమ్‌ వంటి పదార్థం లభించింది. దీనిని ‘బిర్చ్‌’ చెట్టు (కొండరావి చెట్టు వంటిది) బెరడు నుంచి తయారుచేసినట్టు గుర్తించారు. ఈ చెట్ల బెరడును కాల్చి, ఆ బూడిదను వివిధ ప్రక్రియల ద్వారా పేస్ట్‌ మాదిరిగా తయారుచేస్తారు. దీని ని ‘బిర్చ్‌ టార్‌’ అని పిలుస్తారు. వేల ఏండ్లుగా దీనిని గమ్‌ మాదిరిగా అంటించేందుకు వినియోగిస్తున్నారు. లోలాండ్‌ ద్వీపంలో దొరికిన బిర్చ్‌ టార్‌ను కోపెన్‌హాగన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశీలించి అందులో మానవ డీఎన్‌ఏ ఉన్నట్టు గుర్తించారు. దానిని విశ్లేషించగా పూర్తి జన్యుక్రమం బయటపడింది.

మానవ అవశేషాలు కాకుండా వేరే పదార్థాలలో మానవుల పూర్తి డిఎన్‌ఏ లభించడం ఇదే తొలిసారి. దాదాపు 5,600 ఏండ్ల కిందట జీవించిన ఒక మహిళ దానిని చూయింగ్‌గమ్‌లాగా నమిలి ఊసినట్టు నిర్ధారించారు. అందులో లభించిన డిఎన్‌ఏతో పూర్తి జన్యుక్రమాన్ని నిర్మించిన శాస్త్రవేత్తలు, ఆ వ్యక్తి ఒక మహిళ అని, ఆమెకు నల్లని చర్మం, నల్లని కురులు, నీలంరంగు కండ్లు ఉన్నట్టు గుర్తించారు. వయస్సు తెలిసే అవకాశం లేనప్పటికీ, సాధారణంగా చూయింగ్‌గమ్‌ నమిలే అలవాటు పిల్లలకే ఉంటుంది కాబట్టి, ఆ మహిళ టీనేజ్‌ అమ్మాయిగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఆశ్యర్యకరంగా ఉమ్మివేయడానికి ముందు ఆ అమ్మాయి బాదంపప్పు, బాతుమాంసం తిన్నట్లు కూడా వీరు కనుగొన్నారు. పరిశోధకులు తెలిపిన గుర్తుల ఆధారంగా ప్రముఖ చిత్రకారుడు టామ్‌ జోక్‌లండ్‌ ఆ అమ్మాయి చిత్రాన్ని గీసాడు.

బిర్చ్‌ టార్‌ను మరింత విశ్లేషించగా.. అప్పట్లో ఆ మహిళ నోటిలో న్యుమోనియాను కలిగించే స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియే, లింఫ్‌ గ్రంథుల్లో వాపు, జ్వరం కలిగించే ఎప్‌స్టెన్‌ బార్‌ వైరస్‌ వంటి సూక్ష్మజీవులు ఉన్నట్టు గుర్తించారు. ఇదే ప్రాంతంలో దొరికిన ఇతర జంతువుల అవశేషాల్లో 40 రకాల సూక్ష్మజీవు ల ఆనవాళ్లను గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన థెసిస్‌ జేన్సన్‌, హాన్నెస్‌ స్క్రుయేడర్‌ తెలిపారు. బిర్చ్‌ టార్‌ ను చూయింగ్‌ గమ్‌గా కూడా వాడేవారని ఇప్పుడే తెలి సిందన్నారు. వీరి పరిశోధన వ్యాసం నేచర్‌ కమ్యూనికేషన్స్‌ లో ప్రచురితమైంది.