‘సర్దుకున్నారా..!’ రాసిన రచయిత దొరికాడోచ్‌

-

ఏదైనా వార్తగానీ, మంచిగానీ, చెడుగాని సోషల్‌ మీడియాలో అత్యంత వేగంగా వైరల్‌ కావడం చూస్తూనే ఉన్నాం. కొన్ని కథలు, కవిత్వాలు మన మనసును తాకుతాయి. అవి రాసిన రచయితను అభినందించాలనుకుంటాం కానీ అవి ఎవరు రాశారో తెలియదు. అలాంటి కథే ఈ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ‘సర్దుకున్నారా..!’. ఈ కథ చెప్పలేని ఉద్వేగం ఊపేసింది.. గట్టిగా ఉన్న గుండెలను తడిపి మెత్తగా చేసింది. మరి ఈ కథ రాసిన ఆ రచయితను మనలోకం కూడా అభినందించాలనుకుంది. వెదికితే దొరకనిదంటూ ఏదీ లేదు.. అలాగే మన మనసులను హత్తుకున్న కథ రాసిన ‘సర్దుకున్నారా..!’ రచయితను మొత్తానికి చేరుకో గలిగాం.. ఆయన గురించి మనలోకం రీడర్స్‌ కూడా తెలుసుకోవాలని ఈ ప్రయత్నం..

ఈ కథ రాసినవారు శ్రీ ప్రభాకర్‌ జైనీ గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభాకర్‌జైని

ప్రభాకర్ జైని ప్రముఖ సాహితీకారుడు, సినీ దర్శకుడు. వాణిజ్య పన్నుల అధికారిగా వృత్తి జీవితం గడిపిన జైనీ బహుముఖ ప్రజ్ఞాశాలి.
ప్రభాకర్‌ జైని లక్ష్మీనారాయణ, శకుంతల దంపతులకు 1955, సెప్టెంబర్ 1న వరంగల్‌ లో జన్మించారు. ఈయన బాల్యం జనగామలో గడిచింది. ప్రభాకర్‌ జైని తండ్రిది మొదటగా నల్గొండ జిల్లా. రజాకార్ల దాడుల్లో సర్వం కోల్పోయిన ఆయన పొట్ట చేతపట్టుకుని వరంగల్‌కు వలస వచ్చారు. చిన్నతనంలోనే నాన్నను పోగొట్టుకోవడంతో తల్లి, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలి బాధ్యతలను ప్రభాకర్‌ స్వీకరించాడు. ప్రభాకర్‌ జైని తన తండ్రి మరణించిన తర్వాత కారుణ్య నియామకం ద్వారా వరంగల్‌ మున్సిపాలిటీలో ఉద్యోగిగా చేరారు. అనంతరం యూకో బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత వాణిజ్య పన్నుల శాఖలో సీటీవోగా పనిచేస్తూ 2014లో ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

చిన్నతనంలో ప్రభాకర్‌జైని చూసిన సంఘటనలు, చవిచూసిన అనుభవాలే ఆయనను రచయితను, దర్శకుడిని చేశాయి. మొదటి నుంచి రచనారంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ, 1981లో ఆయన మొదటి కథ ‘ఎదను ధర్మం’ ప్రచురితమైంది. 1989లో దాదాపుగా ఆయన ఆత్మకథను పోలి ఉండే ‘కాలవాహిని అలల వాలున’ అనే నవలను రాశారు. ఐఏఎస్‌కు ఎంపికైన ఓ పేద విద్యార్థి నేపథ్యాన్ని ఇందులో చిత్రీకరించారు. అప్పట్లో అది ఓ వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. 1992లో రజాకార్ల ఉద్యమ నేపథ్యంతో ‘గమ్యం’, షేర్‌మార్కెట్‌నేపథ్యంతో 1994లో ‘చోర్‌బజార్‌’, 2007లో దుబాయ్‌, పాకిస్థాన్‌నుంచి బంగ్లాదేశ్‌మీదుగా దేశంలోకి నకిలీ కరెన్సీ సరఫరా అవుతున్న విధానాన్ని ‘రూపాయిలొస్తున్నాయ్‌జాగ్రత్త’ అనే నవలగా రాశారు. ఈ నవల కన్నడంలోకి సైతం అనువాదమైంది. 2014లో సినిమాకు సంబంధించి 24 కళలను దర్శకుని కోణం నుంచి తెలిపేలా ‘నా సినిమా సెన్సారైపోయింది’ అనే నవల రాశారు. ఇదే నవల ఆంగ్లంలో ‘ఐ గాట్‌యూ’ పేరుతో ప్రచురితమైంది. 2015లో జీవితం – ఓటమి = గెలుపేనా?, సినీ పరిశ్రమలో ఉండే ఇబ్బందులు, బాధలను నేపథ్యంగా 2017లో ‘సినీవాలి’ నవల రాశారు. ఈ నవలలన్నీ విశేష పాఠకాదరణ పొందాయి. 2018లో ‘లాకర్‌నంబర్‌369’ అనే నవలను కూడా జైనీ రాశారు. తన బాల్యంలో జనగామలో కోటీశ్వరుడిగా బతికిన తనకు మామయ్య వరసయ్యే వ్యక్తి జీవిత చరమాంకంలో దీనస్థితిని నేపథ్యంగా చేసుకుని 2019లో నిఘా అనే నవలను కూడా రాశారు. 2016లో ‘మీల్స్‌టికెట్‌’ కథతో కథలు రాయడం మొదలెట్టిన జైనీ  ఇటీవలే మొత్తం 18 కథలతో మీల్స్ టికెట్‌అనే కథల సంపుటిని తీసుకువచ్చారు.

సాహిత్యంలో తనకంటూ ఓ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనంతరం సినిమా రంగంపై దృష్టి సారించారు. తెలుగు చిత్రపరిశ్రమకు జాతీయ స్థాయి అవార్డు సాధించిపెట్టడమే ధ్యేయంగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రభాకర్‌ ‘అమ్మా నీకు వందనం’ చిత్రాన్ని, ‘హూ కిల్డ్‌ మి’ అనే లఘు చిత్రాన్ని తీశారు. విలువల వలువలు విప్పేస్తూ స్త్రీల అంగాంగ ప్రదర్శనలతో వికట్టహాసం చేస్తున్న సినిమాలు కాకుండా, మనిషి కేంద్రంగా మానవతా విలువలే లక్ష్యంగా.. సమాజానికి సందేశాన్ని ఇచ్చే లఘు చిత్రాలు, సినిమాలను తీస్తున్నారు. ప్రముఖ రచయిత నవీన్‌ ‘అంపశయ్య’ నవల ఆధారంగా 2016లో ‘క్యాంపస్‌ అంపశయ్య’ అనే చిత్రాన్ని నిర్మించారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన అంపశయ్యను సినిమాగా తెరకెక్కించాలని పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ, లాభాలు తెచ్చిపెట్టదనే కారణంతో ఆ సాహసానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రభాకర్‌ మాత్రం అంపశయ్య చిత్రాన్ని తీసి తీరాలని నిర్ణయించుకుని విజయవంతంగా పూర్తి చేశారు. 2014లో ఆయనను భరతముని ఆర్ట్స్‌ అకాడమీ ఉత్తమ ప్రయోగాత్మక దర్శకుడి అవార్డుతో సన్మానించింది. ఈయన రాసిన నా సినిమా సెన్సార్‌ అయిపోయిందోచ్‌ నవలకుగాను 2014లో నంది అవార్డు లభించింది.

జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి, పేద, మధ్యతరగతి సమాజాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి కావడంతో తనవంతుగా సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. 2006లో తన తండ్రి పేరిట లక్ష్మినారాయణ ఛారిటబుల్‌ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. పాత వరంగల్‌జిల్లాలో ఓ పాఠశాలను దత్తత తీసుకుని ఆ ట్రస్ట్‌ద్వారా విద్యార్థులకు కావాల్సినవి సమకూర్చుతున్నారు. 2007 నుంచి తల్లిదండ్రుల పేరు మీద కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకం అందజేస్తున్నారు. జైనీ ఇంటర్‌నేషనల్‌ఫౌండేషన్‌పేరుతో సాహితీవేత్తలకు ప్రోత్సాహాకాలను కూడా అందిస్తున్నారు. ఇటీవలే తన తల్లి శంకుతల పేరు మీద 12 మంది సాహితీకారులకు స్మారక ప్రోత్సాహక అవార్డులను కూడా అందించారు

మనసుకు దగ్గరై, గుండె భారాన్ని దించేలా రాసిన ప్రభాకర్‌ జైని గారికి ‘మనలోకం’ శతకోటి నమస్సులు అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version