వారాంతపు వ్యవసాయం చేయాలి, రైతులకు సహాయం చేయాలి.. అని మెసేజ్ ఇచ్చారు కదా.. ఆ మెసేజ్‌ను మీరెందుకు పాటించరు..? అంటే ఆ మెసేజ్‌ను మేం పాటించి.. ఆకర్షితులై సినిమా చూడాలి.. మీకు కలెక్షన్లు రావాలి..
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈనాటివి కావు. అసలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో రైతుల బతుకుల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఇప్పటికీ అనేక మంది రైతులకు పంట వేద్దామంటే పెట్టుబడి ఉండదు. అప్పో సొప్పో చేసి పంట వేస్తే.. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల రూపంలో రైతులను మోసం చేసే వ్యాపార జలగలు ఉంటాయి. ఇక అవి కూడా దాటుకుని ముందుకు వెళితే.. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు రైతన్నల కష్టాన్ని నీళ్ల పాలు చేస్తాయి. సరే.. అవి లేకపోయినా.. చివరకు పండిన పంటను అమ్ముకుందామంటే గిట్టు బాటు ధర ఉండదు. ఎంతో కొంతకు పంటను అమ్మేస్తారు. దళారీల రూపంలో ఉండే రాబందులు రైతుల కష్టాన్ని పీక్కుతింటాయి. రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొని ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. లాభాలు గడిస్తారు. మరిక చివరకు రైతుకు మిగిలేది ఏమిటి ? కష్టాలు, కన్నీళ్లు మాత్రమే..!
అసలు మన దేశంలో రైతులంటే ఎవరికీ పట్టదు. పొద్దున్నలేస్తే రైతుల కోసం మేం అది చేస్తాం, ఇది చేస్తాం.. అని చెప్పే రాజకీయ నాయకులు మనకు కనిపిస్తారే కానీ.. నిజంగా ఎవరికీ అన్నదాత గోడు వినిపించదు, కనిపించదు. ఎన్నికలు వస్తే మాత్రం రైతు అందరికీ గుర్తుకు వస్తాడు. అన్ని పార్టీల నేతలు రైతుల ఓట్లు దండుకునేందుకు మాయోపాయాలు పన్నుతుంటారు. చివరికి ఎన్నికల్లో గెలిచాక సాధారణ పౌరులే కాదు, రైతుల వంక కూడా నేతలు కన్నెత్తి చూడరు. వారి కష్టాలు పట్టించుకోరు. ఇది మన దేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే. కొత్తగా ఇప్పుడు దీని గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక సినిమా వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారికి డబ్బులే పరమావధి. సమాజంలో పలు వర్గాలకు చెందిన ప్రజలు పడుతున్న కష్టాలే కాక, సామాజిక సమస్యలను కథాంశాలుగా చేసుకుని సినిమాలు తీసి కోట్లు గడిస్తుంటారు. కానీ ఆ సమస్యలు సమాజంలో నిజంగా ఉన్నా.. వాటి గురించి పట్టించుకోరు. తమ దారిన తాము పోతుంటారు. కానీ సినిమాల్లో మాత్రం సామాజిక సేవకులలా నటులు బిల్డప్ ఇస్తుంటారు. పెద్ద పెద్ద కొటేషన్లను, నీతి సూత్రాలను డైలాగ్‌ల రూపంలో వల్లె వేస్తుంటారు. నిజానికి అవన్నీ.. ఇటీవల విడుదలైన ఓ అగ్ర హీరో సినిమాలో ఆ హీరో చెప్పిన డైలాగ్ ప్రకారం.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో గుడ్ మార్నింగ్ మెసేజ్‌లలా పెట్టుకోవడానికే పనికొస్తాయి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
సినిమా నటులు కూడా సాధారణ పౌరులే కదా. వారు కూడా మనలాగే మనుషులే కదా.. ఎందుకు వారిని ప్రతి అంశంలోనూ విమర్శించడం.. అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అయితే అది ఓ రకంగా కరెక్టే. కానీ.. సమాజంలో ఉండే పౌరులు సినిమాలు చూస్తేనే కదా.. ఆ నటులకు జీవితం ఉండేది, డబ్బులు సంపాదించేది.. మరి ఆ పౌరులకు కష్టం వస్తే.. సమాజంలోని ఒక ప్రధాన పౌరుడిగా (వీఐపీగా) స్పందించే కనీస బాధ్యత ఆ నటులకు ఉండదా..? ఉంటుంది కదా.. పేదలకు, తోటి వారికి సహాయం చేయమనే ఏ మత గ్రంథంలో అయినా ఉంటుంది. అలాంటిది సమాజంలో పౌరుల ద్వారా కల్పించబడిన ఓ ఉన్నత స్థానంలో ఉన్న నటులకు సమాజంలోని సమస్యల పట్ల స్పందించి.. ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత ఉంటుందా..? ఉండదా..? కచ్చితంగా ఉంటుంది. ఉండకపోతే స్పందించి కచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. కానీ అలాంటి బాధ్యత ఏమీ తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరున్నారంటే.. అది నిజంగా మన ఖర్మే అవుతుంది తప్ప మరొకటి కాదు.
ఎప్పుడో తుఫాన్లు వచ్చినప్పుడో లేదా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడో నటులే కాదు, సమాజంలోని పౌరులందరూ తమకు తోచినంత బాధితులకు సహాయం అందిస్తారు. అది సహజమే. కానీ మన సమాజంలో కేవలం ప్రకృతి విపత్తుల బాధితులే కాదు కదా.. అన్ని రకాల బాధితులు కూడా ఉన్నారు కదా.. మరి వారి గురించి సినీ పెద్దలు కొందరు పట్టించుకోరేం. అంటే వారు సినిమాల్లో చెప్పే మాటలు, నీతి సూత్రాల డైలాగులు అన్నీ హుళక్కేనా..? ఇక కొన్ని సార్లు తుపాను బాధితులకు సహాయం చేసేందుకు సినీ పెద్దలు ప్రోగ్రాములు పెట్టి జనాల నుంచి విరాళాలు వసూలు చేసి బాధితులకు ఇస్తుంటారు. అంటే.. అప్పుడు కూడా విరాళాలు ఇచ్చేందుకు జనాల సొమ్మే కావాలి, కానీ సొంతంగా డబ్బులు ఇచ్చే దమ్ము ఎవరికీ ఉండదు. ఎందుకని..? ఎందుకంటే.. అది తమ సొమ్ము కదా.. కనుక దానం ఇవ్వరు.
ఇక అసలు విషయానికి వస్తే.. నటుడు మహేష్ బాబు హీరోగా వచ్చిన తాజా చిత్రం మహర్షిలో రైతుల కష్టాలు, సమస్యల గురించి బాగానే చెప్పారు. వారాంతపు వ్యవసాయం అన్నారు. అంతా బాగానే ఉంది. మరి రైతుల కష్టాలు, సమస్యలను తీర్చేందుకు చిత్ర యూనిట్ ఏ రైతుకైనా కించిత్ సహాయం చేసిందా..? 4 రోజులు దాటితే వసూళ్లు రావని చెప్పి టిక్కెట్ల రేట్లను పెంచి జనాల సొమ్ము దోచుకున్నారు కదా.. రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నామని సక్సెస్ మీట్లు పెట్టారు కదా.. సరే.. బాగుంది.. కానీ సామాజిక అంశంపై సినిమా తీసినప్పుడు దాన్ని చూపించి క్యాష్ చేసుకుంటున్న చిత్ర యూనిట్ రైతులకు ఏం చేసింది ? అంటే.. ఏమీ చేయలేదా ? అంటే.. రైతుల సమస్యలన్నీ సినిమా స్క్రీన్‌కే పరిమితమా..? రైతుల సమస్యలు మీకు పట్టవా..? రైతుల సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. మీరెందుకు స్పందించలేదు ? ఇప్పుడే ఆ సమస్యలు ఎందుకు గుర్తుకు వచ్చాయి ? ఎప్పటి నుంచో ఉన్నత స్థానాల్లో మీరు ఇప్పటి వరకు రైతుల కోసం ఏం చేశారు ?
వారాంతపు వ్యవసాయం చేయాలి, రైతులకు సహాయం చేయాలి.. అని మెసేజ్ ఇచ్చారు కదా.. ఆ మెసేజ్‌ను మీరెందుకు పాటించరు..? అంటే ఆ మెసేజ్‌ను మేం పాటించి.. ఆకర్షితులై సినిమా చూడాలి.. మీకు కలెక్షన్లు రావాలి.. అంతే కదా.. కానీ మీరు మాత్రం రైతుల సమస్యలపై స్పందించరు.. అదే కదా.. అంతే కదా జరుగుతోంది..