వంగవీటి రాధా కృష్ణ. రాజకీయాల్లో ఎంత దూకుడు ఉంటే ఏం జరుగుతుందో ఈ నాయకుడు ప్రత్యక్ష నిదర్శనం. తన దూకుడు నిర్ణయాలతో రాజకీయాల్లో మచ్చగా మారిన నాయకుడు కూడా ఈయనే. తన తండ్రి వంగవీటి రంగా సాధించిన అప్రతిహత అభి మానం, ప్రజాదరణను సైతం సొంతం చేసుకోలేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కుదురు లేని రాజకీయాలు, సత్తువ సాధించలేని ప్రజాబలం వెరసి వంగవీటి రాధాకృష్ణ 15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఆయన సాధించిన, అనుభవించిన పద వుల కన్నా కూడా వివాదాలలోనే ఎక్కువగా కాలం గడిపారు.
ఏ పార్టీలోనూ కుదురు లేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకు న్నారు. వాస్తవానికి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా.. రంగా అభిమానులను సైతం తనతో నిలుపుకోలేక పోయారు. వూహా జనిత రాజకీయాల్లోనే ఊరేగి.. తనకంటూ .. ఒక డయాస్ లేకుండా చేసుకున్నారు. “పెద్దాయన ఉండి ఉంటే.. అసలిలా జరిగేదా?“- వైసీపీ నుంచి వంగవీటి రాధాకృష్ణ ఇటీవల ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న సమయంలో కాపు నాయకులు, రంగా అభిమానులు ఏకబిగిన అన్నమాట ఇది! దీనిని బట్టి.. రంగా కుమారుడిగా.. రాధా సరైన మార్గంలో పయనించారా? లేదా? అనే విషయం ఆసక్తిగా మారింది.
ఇక, విషయంలోకి వెళ్తే.. 2003 చివరిలో కాంగ్రెస్ నాయకుడిగా ప్రజలకు పరిచయం అయిన రంగా తనయుడు రాధా.. ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో 2004లో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో నేటికి ఆయన రాజకీయ ప్రవేశం చేసి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పదిహేను సంవత్సరాల కాలం ఓ సామాన్య నేతకు పెద్ద సమయం కాకపోవచ్చు.
కానీ, ప్రజా పోరాటాల నుంచి వచ్చిన రంగా తనయుడిగా రాధా రాజకీయ భవితవ్యానికి ఇది చాలా పెద్ద సమయం. ఆ విషయం ఎవరో చెప్పడం లేదు. కాపు సామాజిక వర్గమే చెబుతోంది. తనకంటూ ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారు.
పోనీ.. తన తండ్రి రాజకీయ వారసత్వంగా వచ్చిన కాంగ్రెస్‌లోనూ ఆయన ఇమడలేక పోయారు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి చేరారు. ఆ తర్వాత అందులోనూ ఓడిపోయారు. ఇక, జగన్ ప్రారంభించిన వైసీపీలో చేరారు. 2014లో ఓడిపోయారు. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు మరింత దూకుడు ప్రదర్శించి ఏకంగా తన తండ్రి ద్వేషించిన పార్టీ టీడీపీలోకి చేరిపోయారు. పోనీ.. ఇక్కడైనా టికెట్ తెచ్చుకున్నారా? అది లేక పోగా.. కాపు వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అదేసమయంలో చంద్రబాబు గెలుపుకోసం యజ్ఞాలు యాగాలు చేయించారు. ఆయన ఓడిపోయారు. సరే! చేరిన పార్టీలో అయినా నిలిచారా? పట్టు పెంచుకున్నారా? అది కూడా లేదు.
పార్టీ ఓటమి పాలవడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తూ.. పవన్ చెంతకు చేరువ అవుతున్నారు. అసలు పార్టీ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు రాధా వెళ్లి చేసేది ఏంటనే ప్రశ్నకు ఆయన దగ్గరే సమాధానం లేకపోవడం గమనార్హం. ఏదేమైనా.. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తనకంటూ.. ప్రత్యేకతను నిలుపుకోక పోగా.. తన తండ్రి తీసుకువచ్చిన వారసత్వాన్ని సైతం నిలబెట్టుకోలేక పోవడం.. ఎండమావుల వెంట పరుగులు తీయడం రాధాకే చెల్లింది. తప్పుమీద తప్పు.. చేస్తూ.. తప్పటడుగులు వేస్తూ.. ఎప్పటికి నిలబడతాడో చూడాలి!!