అనకూడదు లే గాని… కరోనా అంత దరిద్రం ఇంకొకటి లేదు. మళ్ళీ దాన్ని తిడితే తిట్టే హక్కు మనకి ఎక్కడిది అంటూ కరోనా అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటాయి. దాని పుణ్యమా అని జనాలు అందరూ కూడా ఇంటికి పరిమితం అయిపోయారు. ఏం చెయ్యాలో అర్ధం కాక జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చేశారు. ఒక్క రోజు ఇంట్లో ఉంటేనే భార్య గోల భర్త, భర్త గోల భార్య, తల్లి గోల తండ్రి గోల భరించలేక పిల్లలు నరకం చూస్తారు.
నిజమే కదా మాస్టారూ… జరిగితే జ్వరం అంట సుఖం ఉండదు అంటారు. ఇప్పుడు జరుగుతుంది గాని సుఖం లేదు. టైం పెట్టే భార్య ఉన్నా సరే చాలా మంది భర్తలకు… సిగరెట్ పీకకు దిక్కు లేదు. బయటకు వెళ్తే పోలీసులు ఎక్కడ కొడుతున్నారో తెలియకుండా కొడుతున్నారు. ఇంట్లో ఉంటే, భార్య చెప్పే పనులు చేయలేక, పిల్లల గొడవలను సర్ధలేక నానా యాతన పడుతున్నారు చాలా మంది భర్తలు.
డాబా మీదకు వెళ్లి రెండు పెగ్ లు వేద్దాం అంటే బయట వైన్ షాప్ లేదు. సిగరెట్ కోసం బయటకు వెళ్తే షాప్ లేదు. ఏం చెయ్యాలి మాస్టారూ.. సందు చివర బడ్డీ కొట్టు మనిషి ఏమో లాక్ డౌన్ లో ఇప్పుడు ఏమీ అందుబాటులో లేవు సార్ సిగరెట్ లు ఆపేశారు అంటున్నాడు. సరే ఈ సోది ఎందుకు గాని వీకెండ్ ఈ రోజు. మామూలుగా అయితే మనకు వీకెండ్ వస్తే చాలు బార్, బీర్, తీన్మార్ అన్నట్టు ఉంటది.
కాని ఇప్పుడు కాళ్ళు కట్టేసి కూర్చోపెట్టి, భార్య పెట్టే కార్తిక దీపం, ముద్ద మందారం, బతుకు జట్కా బండి కార్యక్రమాలే దిక్కు అయ్యాయి. మీరు ఎం చెయ్యాలి అనుకుంటున్నారు…? ఏమీ చేయవద్దు గాని, ఈ రాత్రికి హాయిగా నిద్రపోయి, ఉదయాన్నే లేవండి… కంగారు కంగారు గా చికెన్ షాపుకి వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్లి చికెన్ లేదా మటన్ లేదా ఫిష్ తెచ్చుకోండి. తినకపోతే తినకపోయారు గాని జాగ్రత్తగా వెళ్ళండి.
రోజూ మీ భార్యే వండుతున్నారు కాబట్టి మీరు రేపు వండండి. యుట్యూబ్ లో చూస్తారో ఎక్కడ చూస్తారో జాగ్రత్తగా మీకు నచ్చిన వంట మీ భార్యకు నచ్చిన వంట చేసేయండి. పిల్లలను అప్పుడే లేపకండి… డాడీ చేసిన వంట అంటే.. తల నొప్పి అని పడుకునే అవకాశం ఉంది. కాబట్టి సైలెంట్ గా మీరు తినేది తెచ్చేయండి. రోజు తినే కూరగాయలే కదా కాస్త కొత్తగా ఆలోచించి వండటం మొదలుపెట్టండి. కత్తి పట్టుకుని కిచెన్ కింగ్ అయిపోండి.