ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు రాకపోతే అప్పుడు చంద్రబాబును అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ కనీసం చూడను కూడా చూడవు. వైసీపీ వైపే ఆ రెండు పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఎన్నికల ఫలితాలు మరో 12 రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతల మనస్సుల్లో ఇప్పటికే టెన్షన్ మొదలైంది. అది క్రమ క్రమంగా పెరుగుతోంది. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, తాము అధికారంలోకి వస్తామో, రామో.. అని నేతలు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక సర్వేలు కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశం ఉందని తేల్చేశాయి. అలాగే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ సర్వేలు చెప్పేశాయి. దీంతో ఇతర పార్టీల నేతలకు గుబులు మొదలైంది. అయితే మే 23 ఎన్నికల ఫలితాల్లో ఒక వేళ నిజంగానే టీడీపీ ఓడిపోయి, వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తే.. అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి..? అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే…
మే 23వ తేదీన టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినా, రాకున్నా ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం జాతీయ రాజకీయాల్లోనే పూర్తిగా నిమగ్నం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ సర్వేల రిపోర్టులు తలకిందులు అయి ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. అక్కడ ఈ సారి చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను సీఎం చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకే యత్నిస్తారు. అయితే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాకపోతే, సర్వేలు చెప్పినట్లుగా.. వైసీపీకి 20కి పైగా ఎంపీ సీట్లు, టీడీపీకి 1, 2 ఎంపీ సీట్లు వస్తే.. అప్పుడు యూపీఏలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ టీడీపీకి చేయిచ్చి వైసీపీ చేయందుకునే అవకాశం కూడా లేకపోలేదని వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు రాకపోతే అప్పుడు చంద్రబాబును అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ కనీసం చూడను కూడా చూడవు. వైసీపీ వైపే ఆ రెండు పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబు అటు జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రాభవం కోల్పోతారు. అప్పుడు ఆయన తనకు ఎలాంటి ఆప్షన్లను సృష్టించుకుంటారో, టీడీపీని ఎలా ముందుకు తీసుకెళ్తారో అనేది ఆసక్తికరంగా మారుతుంది. అయితే కేంద్రంలో హంగ్ వచ్చే స్థితిలో కాంగ్రెస్ , బీజేపీలు ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలను మద్దతు కోరే పక్షంలోనే ఇలా జరుగుతుంది. అదే ఏదైనా ఒక పార్టీకి పూర్తిగా మెజారిటీ వస్తే.. అప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతాయి.
కేంద్రంలో పూర్తిగా కాంగ్రెస్‌కే మెజారిటీ లభిస్తే.. అప్పుడు ఇతర పార్టీల మద్దతు ఎలాగూ అవసరం ఉండదు కనుక.. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి జాతీయ రాజకీయాల్లో కచ్చితంగా తనదైన ముద్ర వేస్తారు. అయితే బీజేపీ గనక పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తే మాత్రం.. చంద్రబాబుకు మరిన్ని కష్టాలు ఎదురవుతాయని చెప్పడంలో సందేహం లేదు. అంటే.. ఎటొచ్చీ.. వస్తే.. టీడీపీ ఏపీలో అధికారంలోకి రావాలి, లేదా జాతీయ స్థాయిలో హంగ్ వచ్చే స్థితి ఉంటే టీడీపీకి మెజారిటీ ఎంపీ సీట్లు అయినా ఉండాలి. అదీ కుదరకపోతే కనీసం కేంద్రంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అయినా అధికారంలోకి రావాలి. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారు.
అయితే అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా.. ఏదైనా జరగవచ్చు.. ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ఈ క్రమంలో అనుకున్న అంచనాలు తప్పితే.. అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది.. మరి టీడీపీ అధినేత చంద్రబాబు అనుకుంది జరుగుతుందా.. ? పై మూడు సందర్బాల్లో చెప్పినట్లుగా ఏదో ఒక విధంగా ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా..? లేదా అందుకు భిన్నంగా జరుగుతుందా..? టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందా..? అన్నది తెలియాలంటే.. మే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడక తప్పదు..!