ఎడిట్ నోట్ : శ‌భాష్ యోగి

-

దేశంలో రోజురోజుకూ ఆడ‌బిడ్డ‌ల‌కు సంబంధించి లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కొత్త చ‌ట్టాలు ఎన్ని వ‌చ్చినా సంబంధిత విద్రోహ శ‌క్తుల చ‌ర్య‌ల నియంత్ర‌ణ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. ముఖ్యంగా అత్యాచార కేసులేవీ ఒకంత‌ట కొలిక్కి రావ‌డం లేదు. బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం చేయాల‌న్న త‌లంపు ఒక‌టి అమ‌లు కావ‌డం లేదు. ఈ ద‌శ‌లో ఏళ్ల‌కు ఏళ్లు ఇవి కొన‌సాగుతూనే ఉన్నాయి. కోర్టు వాకిట చేతులు క‌ట్టుకుని క‌న్నీరు పెడుతున్న బాధితుల‌కు స‌మాధానం ఇవ్వ‌లేని ద‌య‌నీయ స్థితిలో మ‌న ద‌ర్యాప్తు సంస్థ‌లూ, సంబంధిత వ్య‌వ‌స్థ‌లూ ఉన్నాయి.
ఈ క్ర‌మంలో ఆడ బిడ్డ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం అన్న‌ది అటుంచితే,ముఖ్యంగా ప‌నిచేసే చోట వారికి క‌నీస భ‌ద్ర‌త కూడా కొర‌వ‌డుతోంది. ఇవ‌న్నీ న‌గ‌రాల్లోనే ఎక్కువ‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు. పొట్ట కూటి కోసం ఇక్క‌డికి వ‌స్తున్న యువ‌తులు అభం శుభం తెలియ‌ని యువ‌తులు కొంద‌రి దాష్టీకాల‌కు బ‌లైపోతున్న ఘ‌ట‌న‌లు ప్ర‌తిరోజూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. కంపెనీలు భ‌ద్ర‌త, ర‌క్ష‌ణ అన్న‌వి గాలికొదిలేస్తున్నాయి. కనీసం డ్యూటీ అవ‌ర్స్ అయ్యాక వారిని జాగ్ర‌త్త‌గా వారి వారి గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌ని, చేర్చ‌లేని దౌర్భాగ్యం కంపెనీల‌ది. ఈ త‌రుణాన ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక సంస్క‌ర‌ణ‌తో ముందుకు రావాల్సిందే ! అదే యూపీలో జ‌రిగింది.

 

ఆడ పిల్ల‌ల ర‌క్ష‌ణార్థం ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య నాథ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆడ పిల్ల‌ల‌తో ఉద‌యం ఆరు లోపు, సాయంత్రం ఏడు గంట‌ల త‌రువాత ప‌నులు చేయించ‌వ‌ద్ద‌ని అన్నారు. ఒక‌వేళ ప‌నులు చేయిస్తే రాత పూర్వ‌క అంగీకారం  తీసుకోవాల‌ని, అదేవిధంగా వారికి త‌గిన విధంగా ర‌క్ష‌ణ‌, ఆహారం, ఉచిత ర‌వాణా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ప‌లు కంపెనీల‌కు ఆదేశాలు ఇచ్చారు. ఆడ పిల్ల‌ల‌పై లైంగిక దాడుల నిలువ‌రింత‌కు ఇటువంటి చ‌ర్య‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంటున్నాయి యూపీ బీజేపీ వ‌ర్గాలు. ఎవ్వ‌రైనా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంటే ఆయా సంస్థ‌ల‌ను మూసి వేయిస్తామ‌ని కూడా యోగి హెచ్చ‌రించారు.ఈ నిర్ణ‌యాలు క‌నుక అమ‌ల‌యితే క‌నీసం కొంత స్ధాయిలో అయినా లైంగిక దాడుల‌ను అడ్డుకోవ‌చ్చు. కంపెనీల ప్ర‌తినిధులు రాత పూర్వ‌కంగా ష‌ర‌తులకు అంగీక‌రిస్తే, అందుకు అనుగుణంగా యువ‌తులు ప‌నిచేసేందుకు వీలుంటే, వారికో భ‌ద్ర‌త త‌ప్ప‌క దొరుకుతుంది.

ముఖ్యంగా కొంత వ‌ర‌కూ మ‌గువ‌లు తాము ప‌నిచేశాక, స్వేచ్ఛ‌గా గ‌మ్య స్థానాల‌కు చేరుకునే అవ‌కాశం ఉంటుంది. వాస్త‌వానికి మ‌గువ‌ల భ‌ద్ర‌త‌ను ఇప్ప‌టిదాకా ప‌ట్టించుకోని కంపెనీల‌కు ఇదొక చెంపపెట్టులాంటి నిర్ణ‌యం. ఉద్యోగుల ర‌వాణా, భ‌ద్ర‌త, వారి స్వేచ్ఛ ఇటువంటి విష‌యాల్లో ఇప్ప‌టిదాకా చర్య‌లు తీసుకోని, తీసుకోలేని సంస్థ‌ల‌కు ఇదొక క‌ఠిన రీతిలో చేసిన హెచ్చ‌రిక. ఇక‌పై యూపీలో కంపెనీలు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకునే త‌మ,త‌మ సంస్థ‌ల‌ను న‌డ‌పాల్సి ఉంటుంది. ఒక‌ప్పుడు సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ విష‌య‌మై కొన్ని కంపెనీలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకునేవి. అవే క్యాబ్ ను బుక్ చేసి ఉద్యోగినుల‌ను ఇళ్ల‌కు చేర్చేవి. క్ర‌మ,క్ర‌మంగా అవి కూడా ఆ నిబంధ‌న‌ల‌ను గాలికొదిలేశాయి. అదేవిధంగా ఆఫీసు బ‌స్సులు కూడా ఇప్పుడు క‌నుమ‌రుగయ్యాయి. పెద్ద,పెద్ద న‌గ‌రాల్లోనే ఇంత‌టి దారుణంగా మ‌హిళా భ‌ద్ర‌త ఉంటే ఇక చిన్న చిన్న ప‌ట్ట‌ణాల ఊసు గురించి చెప్పేదేముంది. యోగి తీసుకున్న చ‌ర్య‌ల‌ను దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తే మంచి ఫ‌లితాలు  రావొచ్చు. మ‌హిళా భ‌ద్ర‌త‌కు సంబంధించిన బాధ్య‌త అంద‌రిదీ !

Read more RELATED
Recommended to you

Exit mobile version