విద్యార్థులూ.. రోజూ పది నిమిషాలు ప్రకృతిలో గడపండి

పరీక్షాసమయంలో పిల్లలు విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు. ప్రకృతితో మమేకమవడం చాలా శాంతినిస్తుంది.

పిల్లలకు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. పరీక్షలంటేనే విద్యార్థులు భయపడిపోతారు. ఎంత బాగా చదివే పిల్లలయినా, ఎగ్జామ్స్‌ అనగానే ఎంతోకొంత నెర్వస్‌ కావడం సహజం. పరీక్ష హాల్‌లోకి ప్రవేశించగానే గుండెదడ, బిపి పెరగడం, చెమటలు పట్టడం లాంటివి చాలామందికి అనుభవమే. ఇవన్నీ ఒత్తిడి, అధికశ్రమ వల్ల కలిగే లక్షణాలు.

అయితే, ఈ మధ్యే శాస్త్రజ్ఞులు ఒక శుభవార్త చెప్పారు. రోజుకు కనీసం పది నిమిషాలు ప్రకృతిలో గడిపితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఘంటాపథంగా చెబుతున్నారు. పది నిమిషాలు ఏదైనా పార్కులోనో, చెరువు ఒడ్డునో, సముద్రతీరంలోనో, పచ్చని పొలాల మధ్యో గడిపితే, శారీరక-మానసిక శ్రమ, ఒత్తిడి దూరమై, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని తేలింది.

అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం, 10 నుంచి 50 నిమిషాలు ప్రకృతిలో గడపడమనేది శ్రద్ధాసక్తులను, ఏకాగ్రతను పెంచి, శారీరక శ్రమ లక్షణాలైన గుండెదడ, బ్లడ్‌ప్రెషర్‌లాంటి వాటిని నియంత్రిస్తుంది. సాధారణంగా ముందుజాగ్రత్త చర్యగా డాక్టర్లు, ఒత్తిడి, ఆతృత, కుంగుబాటు లాంటి మానసిక ఆరోగ్య అవలక్షణాలను నిరోధించడానికి విద్యార్థులకు కొన్ని మందులు రాస్తారు. దీన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరపగా, పది నిమిషాల ప్రకృతి వాటన్నింటికంటే మేలు ఫలితాలను ఇవ్వగలదని తేలింది.

‘‘ఎంత కష్టమయిన పరీక్ష ఉన్నా, చదవాల్సిన పోర్షన్‌ ఎంత ఎక్కుగా ఉన్నా, రోజుకు పది నిమిషాల సమయం దొరక్కపోదు. కనీసం వారానికి కొన్ని రోజులైనా సరే, ప్రకృతిలో గడపండి. ఫలితాలు మీకే తెలుస్తాయి’’ అని ఆ పరిశోధకులు నమ్మకంగా చెపుతున్నారు. అయితే ఆ 50 నిమిషాలు అయిపోగానే మళ్లీ మామూలుగానే ఉంటుందని అనుకోవద్దు. ఒకసారి మీరు ప్రకృతిలో గడపడం మొదలెడితే, ఆ ఫలితాలు నిరంతరాయంగా స్థిరంగానే ఉంటాయి తప్ప తగ్గిపోవని వారు స్పష్టం చేసారు.

ఈ అద్భుత ఫలితాలను ఆస్వాదించడానికి ప్రకృతిలో మామూలుగా కూర్చున్నా, నడచినా చాలని చెప్పారు. పైన తెలిపిన శారీరక=మానసిక అవలక్షణాలను దూరం చేయడానికి విద్యార్థులకు అత్యంత సులువైన మార్గాలను సిఫారసు చేయడమే తమ ఉద్దేశ్యమని ఆ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. మనచుట్టూ ఉన్న మొక్కలు, చెట్లు, పువ్వులు, పచ్చిక బయళ్లు చేసే మేలు అంతాఇంతా కాదు. ఇకనుంచి మందుల బదులు కనీసం పది నిమిషాల ప్రకృతి సమయాన్ని చీటీలో రాయాల్సిందిగా డాక్టర్లకు సూచిస్తామని ఆ పరిశోధకులు తెలపడం విశేషం.