కరోనా నేపధ్యంలో తెలంగాణాలో విద్యుత్ బిల్లుల రీడింగ్ తీయడం ఆగిపోయింది అన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పటి వరకు వినియోగదారులు వాడుకున్న విద్యుత్‌కు బిల్లు ఎలా వస్తుందో, ఎంత వస్తుందో అని ఆందోళన చెందే వారు లేకపోలేదు.. అంతే కాదు గత రెండునెలలుగా వాడుకున్న విద్యుత్ బిల్లును లాక్‌డౌన్ ముందు నెల ఎంత వచ్చిందో అంతే చెల్లించండని విద్యుత్ సంస్దలు చెప్పగా కొందరు ఆన్‌లైన్‌లో చెల్లించారు..
మరి కరెంట్ బిల్లు చెల్లించని వారి పరిస్దితి ఏంటని ఆలోచించేవారి విషయంలో విద్యుత్ అధికారులు ఒక ప్రకటన చేశారు అదేమంటే.. ఈ రెండు నెలలకు మీటర్ రీడింగ్ తీయకుండా ప్రొవిజినల్ బిల్లులను చెల్లించే సదుపాయం ఈఆర్‌సీ ఆదేశాల మేరకు కల్పించారు. అంతే కాకుండా 5వ దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో విద్యుత్ బిల్లుల జారీ మళ్లీ మొదలు కానుంది. ఇందుకోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు కూడా చేశారట..
ఇందులో భాగంగా మీటర్ రీడర్లు, రీడింగ్ తీసే సమయంలో మాస్కులు, గ్లౌజులు ధరించనున్నారు. అలాగే, రీడింగ్ తీసిన తరువాత శానిటైజర్‌ను ఉపయోగించనున్నారు. ఇక మీటర్ రీడింగ్ తీసిన తర్వాత మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్కో నెలకు ఎంత చెల్లించాలో యావరేజీ బిల్లుగా తేల్చుతారు. అదెలా అంటే మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల్లో వినియోగించిన మొత్తం రీడింగ్‌ను నమోదు చేసి వచ్చిన మొత్తాన్ని మూడు ముక్కలు చేస్తారన్నమాట..
ఒకవేళ విద్యుత్ వినియోగ దారులు ప్రొవిజినల్ బిల్లు కట్టి ఉంటే వచ్చిన బిల్లు నుంచి ఆయా మొత్తాన్ని మినహాయించి కొత్త బిల్లు ఇస్తారు. ఒకవేళ బిల్లు అసలే చెల్లించని వారు మాత్రం ప్రస్తుతం వచ్చిన బిల్లు మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు..